- పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఘటన
- బాధితులకు అండగా ఉంటామని సీఎం మమత వెల్లడి
కోల్‌కత్తా : నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల బిల్డింగ్ కూలి ఏడుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో సోమవారం జరిగింది. కోల్‌కత్తా సిటీలోని గార్డెన్ రీచ్ ఎరియాలోని అజాన్ మోల్లా లైన్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం సోమవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, కోల్‌కత్తా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలు ఎక్కువగా ఉండటంతో వాటిని గ్యాస్ కట్టర్ సహాయంతో తొలగించేందుకు చాలా సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకొని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతూ చనిపోయారని వెల్లడించారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని, ప్రస్తుతం 11 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే, ఈ బిల్డింగ్‌కు ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిర్మిస్తున్నారని మున్సిపల్ అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బిల్డింగ్ యాజమానిని అరెస్ట్ చేశామని సిటీ మేయర్ తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సోమవారం ఉదయం సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. మృతులకు సంతాపం తెలిపారు.
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. రాష్ట్రంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.లక్ష పరిహారంగా అందజేస్తామని చెప్పారు. బిల్డింగ్ కూలిపోయిన ఘటనలో ఏడుగురు మరణించడం చాలా బాధాకరమని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను టీఎంసీ నేషనల్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ కోరారు.