గండీడ్, వెలుగు: కరెంట్ వైర్లపై పడ్డ పతంగిని తీస్తూ షాక్ కు గురై ఓ బాలుడు చనిపోగా, మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన ఆనం రఘు, చంద్రకళ దంపతులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారు. పండుగకు స్వగ్రామానికి వచ్చారు. కొడుకు మనోజ్ కుమార్(7), లక్కీ కలిసి ఇంటిపై గాలిపటాలు ఎగరేస్తుండగా, గాలిపటం కరెంట్ తీగల్లో చిక్కుకుంది.
దానిని ఇనుప రాడ్‌తో తీస్తుండగా మనోజ్ కుమార్ కు షాక్ కొట్టడంతో కింద పడిపోయాడు. పక్కనే ఉన్న చాకలి సత్తయ్య మనవడు లక్కీకి కూడా షాక్ తగిలింది. వారిద్దరినీ మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే మనోజ్ చనిపోగా, లక్కీకి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహ్మదాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపరామర్శించారు.