ఇండ్లు కట్టి ఏండ్లయినా ఇస్తలేరు!

ఇండ్లు కట్టి ఏండ్లయినా  ఇస్తలేరు!
  • మెదక్ జిల్లాలో వృథాగా 700 డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు
  • పంపిణీ కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలు

మెదక్, నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: బీఆర్ఎస్​హయాంలో జిల్లా వ్యాప్తంగా 700 డబుల్​బెడ్​రూమ్​ఇండ్ల నిర్మాణం పూర్తయి నాలుగైదు ఏండ్లవుతున్నా ఎవరికీ కేటాయించకపోవడంతో వృథాగా ఉన్నాయి. సొంత ఇండ్లు లేక పూరి గుడిసెలు, కిరాయి ఇండ్లలో అరకొర వసతుల మధ్య బతుకుతున్న పేదలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇండ్ల కేటాయింపు జరగకపోగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఇండ్లను పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు. రెండు రోజుల కింద డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని చేగుంటలో పేదలు రోడ్డెక్కి ఆందోళన చేశారు.

మెదక్ జిల్లాకు మొత్తం 4,776  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా వాటిలో 3 వేల ఇండ్లు పూర్తయ్యాయి. మెదక్ పట్టణం, వెల్దుర్తి, పాపన్నపేట మండలంలోని బాచారం, రాంతీర్థం, హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో 2,300 ఇండ్లను పేదలకు పంపిణీ చేశారు. అవిపోను ఆయా చోట్ల మరో 7‌‌‌‌ ఇండ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వాటిని పంపిణీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేసి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిధులను సైతం మంజూరు చేసింది. మెదక్ పట్టణం, నిజాంపేట మండలం చల్మెడ, కల్వకుంట, చేగుంట, కొండాపూర్ లో పూర్తయిన ఇండ్లలో అధికారులు అసంపూర్తి పనులు పూర్తిచేసి పంపిణీకి సిద్ధం చేశారు.  

ఎక్కడెక్కడంటే..

మెదక్ పట్టణ పరిధిలోని పిల్లి కొటాల్ లో 900 పైచిలుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టగా అందులో 500 ఇండ్లను పేదలకు పంపిణీ చేశారు. మిగితా వాటిలో వివిధ దశల్లో ఉన్న 80 ఇండ్ల పనులను పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశారు. నర్సాపూర్ పట్టణంలో 500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా 254 ఇండ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయలేదు. రామాయంపేట పట్టణంలో ఇంకా 50 ఇండ్లు పంపిణీ చేయకుండా ఉన్నాయి. చేగుంట పట్టణంలో 108 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా ఎవరికీ పంపిణీ చేయలేదు. నిజాంపేట మండలం కల్వకుంటలో 74 ఇండ్లు, చల్మెడలో 40 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా అధికారికంగా పంపిణీ చేయలేదు. చల్మెడలో అన్ని ఇండ్లలో, కల్వకుంటలో కొన్ని ఇండ్లలో పేదలు నివాసం ఉంటున్నారు.

గైడ్ లైన్స్ రాక..

కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫీల్డ్ లెవల్ సర్వే ఆధారంగానే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయిన ఇండ్లను ఏ  ప్రాతిపదికన కేటాయించనున్నారనే విషయంలో స్పష్టత లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదివరకు ఇండ్ల నిర్మాణ పనులను పంచాయతీ రాజ్ శాఖ చేపట్టగా  రెవెన్యూ అధికారులు  లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను ఇచ్చేవారు. 

ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో రద్దు చేసిన హౌసింగ్ డిపార్ట్​మెంట్ ను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా హౌసింగ్ డిపార్ట్​మెంట్​కు అప్పగిస్తారా లేదా రెవెన్యూ అధికారుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.