
- ఉమ్మడి జిల్లాలో 75.56 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు
- 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాల్టీల్లో రూ.118.81 కోట్లకు గానూ రూ. 89.78 కోట్లు వసూలు
- పన్ను అడిగిన సిబ్బందిపై ఇంటి యజమాని దాడి
కరీంనగర్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్‌పై విధించిన వడ్డీలో 90 శాతాన్ని రాయితీ ఇచ్చినా ట్యాక్స్ వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ ఆశించినంతగా వసూలు కాకపోవడంతో ప్రభుత్వం ఈ నెల 25న వడ్డీపై రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భవన యజమానుల నుంచి భారీగా స్పందన ఉంటుందని భావించినప్పటికీ వసూళ్లు నిరాశజనకంగా ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలోని 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాల్టీల్లో రూ.118.81 కోట్లకు డిమాండ్ నోటీసులు ఇవ్వగా ఆదివారం రాత్రి వరకు రూ. 89.78కోట్లు(75.56 ) మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.29.03 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఉగాది అయినప్పటికీ ఆదివారం కూడా మున్సిపల్ ఆఫీసర్లు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సోమవారం కూడా ఈ డ్రైవ్ కొనసాగనుంది.
జమ్మికుంట, హుజూరాబాద్ 100 శాతం పూర్తి
100 శాతం వన్ను వసూళ్లతో జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. హుజూరాబాద్ పరిధిలో 8,917 ఇళ్లు, వ్యాపార సముదాయాల నుంచి రూ.2.64 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 12,607 అసెస్మెంట్స్ నుంచి రూ.3.03 కోట్లకు పూర్తిగా వసూలయ్యాయి. ప్రతి ఏటా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో ముందుండే సిరిసిల్ల మున్సిపాలిటీ(95 శాతం) ఈసారి కాస్త వెనకబడినా మూడో స్థానంలో నిలిచింది.
10 మున్సిపాలిటీలు 80శాతం దాటగా.. మిగతా మున్సిపాలిటీల్లో ఇంకా 63 శాతం నుంచి 79 శాతంలోపే ట్యాక్స్ వసూలైంది. ఇక కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లలో పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగానే ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 86,815 అసెస్మెంట్లు ఉండగా... రూ.50.56 కోట్లకుగానూప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా రూ. 36.27 కోట్ల పన్నులు(70.93 శాతం) మాత్రమే వసూలయ్యాయి. రామగుండం బల్దియాలో 50,988 అసెస్మెంట్లు ఉండగా.. రూ.14.93 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ.10.29 కోట్లు (68.92 శాతం) మాత్రమే వసూలైంది.
రెవెన్యూ క్లబ్, రెవెన్యూ గార్డెన్ సీజ్...
నోటీసులు ఇచ్చినా ఆస్తి పన్నులు కట్టని పలు ప్రాపర్టీలను సీజ్ చేయడంతోపాటు పలు ఇండ్ల నల్లా కలెక్షన్లను తొలగించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని రెవెన్యూ క్లబ్, రెవెన్యూ గార్డెన్ కు సంబంధించిన ఆస్తి పన్ను దాదాపు రూ.87 లక్షలు చెల్లించాల్సి ఉండగా గతంలోనే నోటీసులు జారీ చేశారు. నోటీసుల గడువు ముగియడంతో రెవెన్యూ క్లబ్, గార్డెన్ ప్రాపర్టీలకు ఆర్వో భూమానందం ఆద్వర్యంలో తాళం వేసి సీజ్ చేశారు.
పన్ను అడిగిన సిబ్బందిపై దాడి..
34 వ డివిజన్ గోదాంగడ్డ ఏరియా హనుమాన్ దేవాలయం సమీపంలో బకాయి ఆస్తి పన్ను చెల్లించాలని అడిగిన వార్డు ఆఫీసర్, సపోర్టింగ్ ఉద్యోగిపై ఆంథోని అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. దుర్బాషలాడుతూ సపోర్టింగ్ ఉద్యోగిపై దాడి చేసి టూ వీలర్‌ను ధ్వంసం చేశాడు. దీంతో బల్దియా తోటి రెవెన్యూ ఉద్యోగులు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ కమిషనర్‌కు సమాచారమిచ్చారు. అనంతరం దాడి చేసిన వ్యక్తి పై టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.