
- ప్రభుత్వ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేయండి
- ప్రొటెక్టడ్ బై హైడ్రా’ బోర్డులు పెట్టండి
- సిటీ ప్రజల నుంచి 78 ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: బుద్ధభవన్‌లోని హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 78 ఫిర్యాదులు అందాయి. ఇందులో ప్రధానంగా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ సర్వే నంబర్119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాల్లో అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో 3,800 మంది గ్రామ పంచాయతీ లేఔట్‌లో ఇంటి స్థలాలు కొని రిజిస్టర్ చేసుకున్నారని, అయితే ఆ భూమి ప్రభుత్వానిదని తేల్చడంతో తాము హైకోర్డుని ఆశ్రయించామని, ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సి ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు వివరించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ అక్కడ కొందరు వ్యక్తులు వ్యవస్థలను మేనేజ్‌చేసి ఇంటి స్థలాలుగా నేటికీ అమ్మేస్తున్నారని చెప్పారు.
ఇలా 700 పైచిలుకు ఇండ్ల నిర్మాణం జరిగిందని, ప్రభుత్వ శాఖలు కూడా కరెంటు, తాగునీరు, రహదారుల సౌకర్యం కల్పిస్తున్నాయని తెలిపారు. హైడ్రా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గతంలో అక్కడ ఇంటి స్థలాలు కొన్నవారు ఫిర్యాదు చేశారు. అలాగే అబ్దుల్లాపూర్మెట్మండలం కుంట్లూర్(పెద్ద చెరువు) చెరువులో 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని, 59 జీఓ ప్రకారం రెగ్యులరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే ఆ భూమిని కాపాడాలంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. నిజాంపేట మున్సిపాలిటీలోని మొదటి డివిజన్‌లో 2,900 గజాల పార్కును స్థానికులు కబ్జా చేస్తున్నారని కేవీఆర్ రెయిన్‌బో కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
ఈ పార్కులో వ్యాయామానికి సంబంధించిన పరికరాలు అమర్చితే వాటిని తొలగించి కబ్జా చేయబోగా తాము అడ్డుకున్నామని, అక్కడ హైడ్రా బోర్డు పెడితే పార్కును కాపాడినవారవుతారని ఫిర్యాదు చేశారు. సరూర్‌నగర్ మండలం చింతలకుంట ప్రాంతంలోని మన్సూరాబాద్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని పెంచేసి తమ ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని వాసవి గ్రాడ్యుయేట్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్స్‌ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించి పూర్తి వివరాలను కమిషనర్ రంగనాథ్ తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఆయా ఫిర్యాదులను కేటాయించి లోతైన విచారణ చేపట్టాలని సూచించారు. పూర్తి వివరాలు తెలుసుకుని ఫిర్యాదు దారుల సమక్షంలోనే విచారణ జరిపించాలని ఆదేశించారు.
రెండు వారాల్లో అధికారులు వస్తారు
రెండు వారాల్లో అధికారులు వచ్చి విచారణ చేపడతారని, అధికారుల ఫోను నంబర్లను ఫిర్యాదుదారులకు కమిషనర్అందజేశారు. 4 వారాలకు సమస్య పరిష్కారం కాకుంటే తర్వాత నేరుగా తానే వచ్చి విచారిస్తానని రంగనాథ్చెప్పారు. ముందుగా విచారణ జరిపించి కబ్జాదారుల మీద మీద కేసులు పెట్టాలని సూచించారు. కబ్జాల చెర నుంచి కాపాడిన ప్రభుత్వ భూములు, పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి వాటిలో ‘ప్రొటెక్టడ్ బై హైడ్రా’ అని బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్ సీ శాటిలైట్ ఇమేజీలతో పాటు గ్రామాలకు చెందిన మ్యాప్‌లను పరిశీలించి వాటి ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించాలని సూచించారు. అమీన్‌పూర్ చెరువు, దుర్గం చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువు, మాసబ్ చెరువు(తుర్కయాంజల్)ను ముందుగా పరిశీలించాలన్నారు.