-
ఒరిజినల్ నోట్లలా కనిపించేందుకు టెక్నిక్స్ నేర్చుకున్నరు
-
వరంగల్‌లో ముఠా అరెస్ట్
-
రూ.6 లక్షల నకిలీ 2 వేల నోట్లు స్వాధీనం
వరంగల్ క్రైం, వెలుగు : యూట్యూబ్ లో వీడియోలు చూసి నకిలీ 2 వేల నోట్లు ముద్రిస్తూ చెలామణి చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.6 లక్షల నకిలీ 2వేల నోట్లు, ప్రింటర్, ఏడు సెల్ఫోన్లు, రెండు టూ వీలర్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సీపీ డా.తరుణ్ జోషీ వివరాలు తెలియజేశారు. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ప్రధాన నిందితుడు సయ్యద్ యాకుబ్(31) అలియాస్ షకీల్, కాజీపేట్ చింతల్ బస్తీకి చెందిన గడ్డం ప్రవీణ్ (33), గుండ్ల రజని (33) గతంలో కిడ్నాప్ కేసులో అరెస్టయి రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించారు. ఆ సమయంలోనే జైలులో వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠాతో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా దొంగ నోట్లు ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నారు. విడుదలైన తర్వాత హనుమకొండకు చెందిన పేరాల అవినాష్ (28), మచిలీబజార్ కు చెందిన ఎండీ అక్రం అలీ (27), కాపువాడకు చెందిన కత్తి సునిత (23), సోహైల్ (22), నర్సంపేట రాజీవ్ నగర్ కి చెందిన కత్తి రమేశ్(24), హనుమకొండ న్యూరాయ్పురకు చెందిన ఎండీ సమీర్ (30) లను కలుపుకుని ముఠాగా ఏర్పడ్డారు. దొంగ నోట్లు నకిలీవి అని తెలియకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో వీడియోలు చూశారు. అందులో టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఒరిజినల్రూ.2 వేల రూపాయ కాగితాన్ని పోలివుండే పేపర్లను కొని పెద్దమ్మగడ్డలోని సయ్యద్ యాకుబ్ ఇంట్లో ముద్రించారు.
ఈ నోట్లను రద్దీగా ఉండే బట్టలషాపులు, బెల్ట్ షాపుల్లో, కిరాణాల్లో చెలామణి చేసేవారు. ఏడాదిగా వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ నకిలీ నోట్లను చెలామణి చేశారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు. శుక్రవారం సయ్యద్ యాకుబ్, మరో నిందితుడు అవినాష్ నకిలీ కరెన్సీతో సుబేదారి పీఎస్ పరిధిలోని తిరుమల బార్ వద్దకు వచ్చినట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిచ్చిన సమాచారంతో మిగిలిన వారిని పట్టుకున్నారు. న్యూరాయ్పురకు చెందిన సమీర్ పరారీలో ఉన్నాడు. ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నరేశ్‌కుమార్, ఎస్.ఐలు నిస్సారాషా, సుబేదారి ఎస్.ఐ రవికిరణ్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్స్ మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబుల్స్ రాజేశ్, బిక్షపతి, శ్రీను, శ్రవణ్ కుమార్, రాజు, గౌతంలను సీపీ అభినందించారు.