హైదరాబాద్: ప్రజల రక్షణ కోసం పాటు పడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు.. కానీ వృత్తి ధర్మం మరిచి దొంగలతోనే చేతులు కలిపిన మాజీ కానిస్టేబుల్ జీవితం చివరకు విషాదంగా ముగిసింది. చేతులు కలిపిన దొంగల చేతిలోనే చివరకు దారుణ హత్యకు గురి అయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో, టాస్క్ఫోర్స్ టీమ్‌లో ఈశ్వర్ కానిస్టేబుల్‌గా పనిచేశాడు.
కానిస్టేబుల్‌గా ఉంటూ చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ పాల్పడటంతో పాటు దొంగలతో దోస్తాన్ చేయడంతో పోలీసులు ఉద్యోగం నుండి తొలగించారు. దీంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి పారిపోయి అక్కడ కూడా మట్కా, పిక్ ప్యాకెటింగులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే సెటిల్మెంట్ కోసం ఈశ్వర్‌ను అతడి ప్రత్యర్థులు హైదరాబాద్ పిలిపించారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ పీఎస్ పరిధిలో సామ బార్ వద్ద 6 రోజుల క్రితం ఈశ్వర్‌పై దాడికి పాల్పడ్డారు ప్రత్యర్థులు.
తీవ్రంగా గాయపడ్డ ఈశ్వర్.. ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దొంగల ముఠా నాయకుల మధ్య విభేదాలే ఈశ్వర్‌పై దాడికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఏళ్లుగా పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ నిర్వహిస్తున్న ఈశ్వర్.. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల చోరీలు, చైన్ స్నాచింగ్‌లు చేయించాడు. ఈ క్రమంలో గ్యాంగ్ లీడర్స్ మధ్య విభేదాలు చెలరేగాయి. దీంతో సెటిల్‌మెంట్ కోసం పిలిచి కారుతో ఢీ కొట్టిన హతమార్చారు. ఈశ్వర్‌పై దాడికి పాల్పడ్డ వారి కోసం మూడు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.