నేటి సమాజంలో ఇంకా వర్గ పోరులు జరుగుతూనే ఉన్నాయి. అంటరాని తనమంటూ.. బలహీన వర్గాల ప్రజలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. యువకులనైతే కర్రలతో కొట్టడం, మహిళలనైతే అత్యాచారం చేయడం.. కొంతమందిని ఆలయాల్లోకి ప్రవేశించకుండా నిషేధించడం ఇలాంటి వార్తలన్నీ మీడియాలో తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లో రెండు రోజుల క్రితం (వార్త రాసే రోజుకు) గిరిజన కూలీపై ఒక నీచుడు మూత్రం పోయగా... ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్ లోనే మరో వ్యక్తి కి పరాభవం జరిగింది. చెప్పుల దండ వేసి.. గ్రామంలో ఊరేగించి అవమానించిన ఘటన మధ్యప్రదేశ్ లోని రేవాలోని సోహాగో గ్రామంలో కలకలం రేగింది. ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
https://twitter.com/FreePressMP/status/1677602884849106944
మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవాలోని సోహాగో గ్రామం ఓ వ్యక్తికి 2023, జూన్ 23న అవమానం జరిగింది. దొంగతనం చేశాడని ఆరోపణలతో కర్రలతో దారుణంగా రక్తం కారేటట్టు బాది.. చెప్పుల దండ వేసి ఊరేగించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో శనివారం ( జులై8) వైరల్ అయింది.
సోహాగో గ్రామానికి చెందిన దేశ్‌పాల్ సింగ్ మరియు హరి ఓం సింగ్‌లు తండ్రీ కొడుకులు. తమ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఇంద్రజిత్ మాంఝీ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి.. చెప్పుల దండ వేసి రాజరికపాలనను గుర్తు చేశారు. బహుశా వారు కూడా అలాప్రవర్తించరేమో.. పైగా .. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారు. బాధితుడి శరీరం మొత్తం గాయాలు కాగా.. వైద్య పరీక్షలు అనంతరం పోలీసులు నిందితులపై దాడి కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం...
దేశ్‌పాల్ సింగ్ అతని కుమారుడు హరి ఓం , అతని మేనల్లుడు రింకీ కలిసి ఇంద్రజిత్ మాంఝీపై దాడి చేసి పరారయ్యారని .. మాంఝీ మేనల్లుడు రోహిత్ మాంఝీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశ్‌పాల్ సింగ్ , ఆయన కుమారుడు, మేనల్లుడు రింకీ ముగ్గురూ.. తనను, అతని మేనల్లుడును సింగ్ ఇంటికి పిలిచి దొంగతనం ఆరోపణలు చేశాడని బాధితుడు ఇంద్రజిత్ మాంఝీ పోలీసులకు వెల్లడించాడు. తమను కొడుతూ... చెప్పుల దండ వేసి దారుణంగా వ్యవహరించాడని ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులైన దేశ్‌పాల్ సింగ్ అతని కుమారుడు హరి ఓం సింగ్ అతని మేనల్లుడు రింకీ లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
వివక్ష సమాజం ఇంకానా?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. బలహీన వర్గాల ప్రజలు ఇంకా హింసకు, అణచివేతకు గురౌతుండటం వివక్షతో నిండిన సమాజం ఇంకా కొనసాగుతుందనే వాదనకు అద్దం పడుతున్నది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 1991 నుంచి 9 లక్షలకు పైగా బలహీనవర్గాల ప్రజలను అవమానించిన కేసులు పోలీసుల వద్ద నమోదయ్యాయి. ఇవి అధికారికంగా నమోదైన కేసులు మాత్రమే. అనధికారికంగా జరుగుతున్న దాడులు భారీగా ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలా చట్ట వ్యతిరేకంగా పాల్పడే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది.