కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని పెట్రోల్ పోసుకున్నడు

కాంగ్రెస్  సెకండ్ లిస్ట్ కొంతమంది నేతల్లో జోష్  నింపితే  మరికొంతమందిలో నిరాశను కలగజేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని  ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరోసారి వర్గ పోరు భగ్గుమంది.  అక్కడి నుంచి వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కాంగ్రెస్  టికెట్ నిరాకరించడంతో ఆయన అనుచరుడు,  నాగిరెడ్డిపేట మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్  నిరాశ చెందాడు. దీంతో ఒంటిపై  పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు రాకేష్ ను అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.  కాగా ఎల్లారెడ్డి టికెట్ ను కాంగ్రెస్   కె మదన్ మోహన్ రావుకు కేటాయించింది.  

45 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను  శుక్రవారం రాత్రి కాంగ్రెస్  విడుదల చేసింది. రెడ్లకు 21 సీట్లను, బీసీలకు 8 స్థానాలను, ఎస్టీలకు 6, ఎస్సీలకు 3, కమ్మ సామాజిక వర్గానికి 3, వెలమలకు రెండు, బ్రాహ్మణులకు ఒకటి, మైనార్టీలకు ఒక స్థానాన్ని కేటాయించింది. ఇటీవల కొత్తగా చేరిన 15 మంది నేతలకు టికెట్లను కన్ఫమ్ చేసింది. 

తొలి జాబితాలోని 55 మందితో కలిపి ఇప్పటివరకు 100 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తంగా ఈ వంద సీట్లలో రెడ్లకు 38, బీసీలకు 20 స్థానాలను పార్టీ ఇచ్చింది. సెకండ్​ లిస్ట్​లో  గద్దర్ కూతురు వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డికి మునుగోడు, పొన్నం ప్రభాకర్‌‌‌‌కు హుస్నాబాద్, మధు యాష్కీ గౌడ్‌‌కు ఎల్బీ నగర్‌‌‌‌ సీటును కేటాయించింది.​