వెరైటీ : కొబ్బరి ఆకులనే స్ట్రాగా మలిచిన ప్రకృతి ప్రేమికురాలు

వెరైటీ : కొబ్బరి ఆకులనే స్ట్రాగా మలిచిన ప్రకృతి ప్రేమికురాలు

కొందరు వస్తువుల్ని ప్రేమిస్తారు. ఇంకొందరు తిండిని ప్రేమిస్తారు. కొంతమంది మనుషుల్ని ప్రేమిస్తారు. చాలామంది మనీని ప్రేమిస్తారు. అయితే.. మనిషి మనుగడకు కారణమైన ప్రకృతిని మాత్రం చాలా తక్కువ మంది ప్రేమిస్తుంటారు. అందుకే.. ఇప్పటికీ ఈ ప్రకృతి అంతో ఇంతో భద్రంగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అలాంటి వారే.

 కొబ్బరి బోండా తాగాలంటే కచ్చితంగా స్ట్రా ఉండాల్సిందే. లేదంటే.. బాటిల్లో నింపి తాగడమే మార్గం. ఇక బేకరీల్లో కూల్డ్రింక్స్ తాగేవాళ్లలో చాలామంది స్టైల్గా స్ట్రా వేసుకొని తాగడం మనం చూస్తూనే ఉంటాం. తాగిన తర్వాత ఆ స్ట్రా పడేస్తారు. ఆ బేకరీ వాళ్లు ఆ చెత్త తీసుకెళ్లి ఎక్కడో పడేస్తారు. కానీ.. ఆ స్ట్రా మాత్రం అలాగే కొన్ని సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉండిపోతుంది.  

 అలా కాకుండా.. చెత్త కుప్పలో పడేసిన కొన్నిరోజులకే ఆ స్ట్రా భూమిలో కలిసిపోతే ఎంత బాగుంటుంది?  ఐడియా బాగుంది కదా! ఇదే ఐడియా ఫిలిప్పీన్స్లో ఓ షా ప్ యజమానికి వచ్చింది. దాన్ని అమలు చేయడానికి ఏం చేయాలా? అని ఆలోచిస్తే.. మనసులో ఓ ఐడియా మెరిసింది. వెంటనే ఆ ఐడియాను తన టీమ్తో కలిసి షేర్ చేసుకుంది. ఇప్పుడు అమలు చేస్తున్నారు కూడా. ఫిలిప్పీన్స్లోని సిర్గావో ఐలాండ్లో ఓ కేఫ్ ఉంది. దాని పేరు 'కేఫ్ ఎయిథా'. దాని యజమాని 'సారా టియు'. 

ఈమె ప్రకృతి ప్రేమికురాలు. గ్రీన్ స్ట్రా పేరుతో తనకు వచ్చిన ఐడియాను అమలు పరిచి తను స్వచ్ఛమైన పర్యావరణ ప్రేమికురాలిగా నిరూపించుకుంది. కొబ్బరి ఆకులతో స్ట్రా తయారుచేసి తన కేఫ్కి వచ్చిన వారికి అవే అందిస్తుంది. కొబ్బరి స్ట్రా వాడడానికి నిరాకరించిన వారికి నిర్మొహమాటంగా 'మీకు మా షాపులో ఉన్న తినుబండారాలు అమ్మం. దయచేసి వెళ్లవచ్చు. ప్రకృతిని ప్రేమించలేని మీలాంటి వారికి మా షాపులో అనుమతి లేదు’ అంటూ పంపించివేస్తున్నది.

 ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గిద్దాం.. అందుకు మేము మా వంతుగా ప్రయ త్నిస్తున్నాం. మీరు కూడా సహకరిస్తూ.. ఈ ప్రకృ తిని కాపాడుకునే యజ్ఞంలో భాగం కండి అంటూ తనకేఫ్ వచ్చే కస్టమర్లకు చెప్తున్నది సారా. ఇంతకీ సారాకి ఈ ఐడియా ఎలా వచ్చిందో తెలుసా? ఒకసారి తన కుటుంబంతో కలిసి కొర్రెగిడార్ ఐలాండ్కి వెళ్లింది. అక్కడివారు కొబ్బరి ఆకులతో స్ట్రా తయారుచేయడం చూసింది.

 వాళ్ల దగ్గరికి వెళ్లి ఆసక్తిగా గమనించి వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుంది. కొబ్బరిబోండాల వ్యాపారి పర్యావరణం గురించి ఆలోచిస్తున్నాడు. నేను చదువుకొని కూడా ప్లాస్టిక్ వాడుతున్నాను. ఈ క్షణ నుంచే మార్పు మొదలవ్వాలి అంటూ తను కూడా తన కేఫ్లో కొబ్బరి ఆకులతో చేసిన స్ట్రాలు తయారుచేసి, వాడకం మొదలుపెట్టింది.

 ఇంట్లో కూడా వీలైనంత వరకు ప్లాస్టిక్ తగ్గించి పర్యావరణాన్ని కాపాడడానికి తనవంతు కృషి చేస్తున్నది. ఒక్క స్ట్రా తయారుచేయడానికి వాళ్లకి పట్టే సమయం ఒకటి నుంచి రెండు నిమిషాలు. ఖాళీ సమయం దొరికినప్పుడు స్ట్రాలు తయారుచేస్తూ, మిగతా సమయంలో బిజినెస్ చూసుకుంటున్నది సారా.