ఉయ్యాల మెడకు చుట్టుకుని పన్నెండేండ్ల బాలుడు మృతి

ఉయ్యాల మెడకు చుట్టుకుని పన్నెండేండ్ల బాలుడు మృతి
  • కుమ్రం భీం జిల్లా దిందాలో విషాదం

కాగజ్ నగర్, వెలుగు : సరదాగా ఉయ్యాల ఊగుతున్న పన్నెండేండ్ల బాలుడు చీర మెడకు చుట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన డగే నారాయణ, కాంతాబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు అంజన్న (12) ఉన్నారు. అంజన్న స్థానిక స్కూల్​లో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం స్కూల్ కి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నాడు. తండ్రి వ్యవసాయ పనులకు వెళ్లగా,  తల్లి ఇంటి బయట పనులు చేసుకుంటోంది. మధ్యాహ్నం పూట ఇంట్లో చీరతో కట్టిన ఉయ్యాలలో అంజన్న ఊగుతున్నాడు.

ఈక్రమంలో ఆ చీర అంజన్న మెడకు చుట్టుకుంది. దగ్గర ఎవరూ లేకపోవడంతో ఎవరు గమనించలేదు. కొద్దిసేపటికి బాలుడి అక్క ఇంట్లోకి వచ్చి చూడగా తమ్ముడు ఉయ్యాలకి చుట్టుకొని నిర్జీవంగా కనిపించాడు. దీంతో ఆమె కేకలు వేయగా తల్లి, చుట్టుపక్కల వాళ్లు వచ్చి అంజన్నను హుటాహుటిన దవాఖానకు తరలించారు. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.