కొత్తగూడెం నియోజకవర్గంలో .. ఎయిర్​ పోర్టుపై ఏఏఐ టీమ్​ ప్రైమరీ సర్వే

కొత్తగూడెం నియోజకవర్గంలో .. ఎయిర్​ పోర్టుపై ఏఏఐ టీమ్​ ప్రైమరీ సర్వే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గంలో గ్రీన్​ ఫీల్డ్ ఎయిర్​ పోర్టు ఏర్పాటుపై ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ) స్పెషల్​టీమ్​ గురువారం పర్యటించింది. కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్​ మండలాల్లో ఎయిర్​ పోర్టు ఏర్పాటు కోసం ఇప్పటికే గుర్తించిన భూముల్లో  ఆరుగురితో కూడిన స్పెషల్​ టీమ్ ల్యాండ్​ఎయిర్​పోర్టుకు అనుకూలంగా ఉందా.. తదితర అంశాలపై ప్రైమరీ సర్వే చేపట్టింది. ఈ టీంలో ఏరో ప్లానింగ్​ అధికారి అబ్దుల్​ అజీజ్, ఆర్కిటెక్చర్​ అధికారి మహ్మద్​ సాకిబ్, ఆపరేషన్​ అధికారి ప్రశాంత్​ గుప్తా, సీఎన్​ఎస్​ అధికారి ఆర్​ దివాకర్, ఇంజినీరింగ్​ అధికారి సి, మనీష్​జోన్వాల్, ఎఫ్​పీడీ ఆఫీసర్​ప్రవీణ్​ ఉన్నికృష్ణన్​ఉన్నారు. ల్యాండ్​కు సంబంధించి న వివరాలను మ్యాప్​ల ద్వారా కలెక్టర్, అడిషనల్​కలెక్టర్​ఏఏఐ టీమ్​కు వివరించారు. 

సర్వే బృందంతో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ భేటీ అయ్యారు. జిల్లాలోని పరిశ్రమలు, పర్యాటకం, ఇతరత్రా వివరాలను పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా కలెక్టర్​ ఏఏఐ టీంకు కలెక్టరేట్​లో వివరించారు. విమానశ్రయ ఏర్పాటుపై నివేధికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఏఏఐ టీం పేర్కొంది. అనంతరం ఎంపీ రఘురాంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్​పోర్టు ఏర్పాటుకు సుముఖంగా ఉందన్నారు.

 సుజాతనగర్, చుంచుపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లోని ఎంపిక చేసిన దాదాపు 950 ఎకరాల ల్యాండ్​ ఎయిర్​పోర్టుకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్​ తర్వాత భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే అధికంగా పరిశ్రమలున్నాయని, ఇక్కడ ఎయిర్​పోర్టు ఎంతగానో దోహదపడుతుందన్నారు. కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​మాట్లాడుతూ ఎయిర్​ పోర్టు ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్​ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​కలెక్టర్​డి.వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీవో మధుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.