ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపియల్స్ గాడిలో పడింది. చివరి మ్యాచ్ లో కేకేఆర్ పై బ్యాటింగ్ లో తడబడిన పంత్ సేన నేడు (మే 7) రాజస్థాన్ పై జరుగుతున్న మ్యాచ్ లో అదరగొట్టింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే కీలకంగా మారిన మ్యాచ్ లో జూలు విదిల్చింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65, 7 ఫోర్లు, 3 సిక్సులు) మెక్‌గుర్క్(20 బంతుల్లో 50, 3 సిక్సులు, 7 ఫోర్లు) మెరుపులు మెరిపించారు.
తొలి ఓవర్ నుంచే ఢిల్లీ ఎదురుదాడికి దిగింది. అభిషేక్ పోరెల్,మెక్‌గుర్క్ రాజస్థాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ పరుగుల వరద పారించారు. ఈ ఇద్దరి ధాటికి కేవలం 3.4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ అందుకుంది. తొలి వికెట్ కు 60 పరుగులు జోడించిన తర్వాత అశ్విన్ బౌలింగ్ లో మెక్‌గుర్క్ ఔటయ్యాడు. ఆ తర్వాత దిగిన హోప్ (1) ఊహించని రీతిలో రనౌటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు పోరెల్ చెలరేగి ఆడాడు. అక్షర్ పటేల్ (15), పంత్ (15) బ్యాట్ ఝళిపించడానికి ఇబ్బందిపడుతుంటే.. పోరెల్ అలవోకగా బౌండరీలు పరుగులు రాబట్టాడు.
హాఫ్ సెంచరీ చేసిన పోరెల్ తో పాటు పంత్ ఔట్ కావడంతో స్కోర్ వేగం తగ్గింది. అయితే చివర్లో స్టబ్స్ (20 బంతుల్లో 41, 3 ఫోర్లు, 3 సిక్సులు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో ఢిల్లీ స్కోర్ 220 మార్క్ ను అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి. బోల్ట్, సందీప్ శర్మ, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.