ఫెసిలిటీస్​ కల్పించాకే కాలేజీని షిఫ్టు చేయాలి : ఏబీవీపీ కార్యకర్తలు

ఫెసిలిటీస్​ కల్పించాకే కాలేజీని షిఫ్టు చేయాలి : ఏబీవీపీ కార్యకర్తలు
  • అప్పటిదాకా ఓల్డ్​ బిల్డింగులోనే డిగ్రీ క్లాసెస్​ను కొనసాగించాలి
  • అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ ఏబీవీపీ రాస్తారోకో

హుస్నాబాద్​, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనంలో ఎలాంటి వసతులు లేకున్నా, అధికారులు కాలేజీని అందులోకి షిఫ్టు చేయడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు శుక్రవారం రాస్తారోకో చేశారు. అన్ని రకాల ఫెసిలిటీస్​ కల్పించేదాకా ఓల్డ్​ బిల్డింగులోనే తరగతులను నిర్వహించాలని హుస్నాబాద్​లోని అంబేద్కర్​ చౌరస్తాలో నిరసనకు దిగారు.  స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్లు వివేక్, ఆదిత్య ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వచ్చి ఆందోళన చేపట్టారు.   డిగ్రీ కాలేజీ కోసం నిర్మించిన కొత్త బిల్డింగులో ఎలాంటి వసతులు లేవన్నారు.

కరెంటు, ఇంటర్నెట్​, నీళ్ల సౌకర్యం లేదన్నారు.  కొత్త బిల్డింగులో వసతులు కల్పించేదాకా కాలేజీని షిఫ్టు చేయవద్దన్నారు.  విద్యార్థులు సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హుస్నాబాద్​ ఎస్సై మహేశ్​ పోలీసు సిబ్బందితో వచ్చి సముదాయించారు. అయినా కదలకపోవడంతో వివేక్​, ఆదిత్యను బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకొని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లారు. వారితోపాటు ఆ సంఘం హుస్నాబాద్ నగర కార్యదర్శి రాకేశ్​, ఉపాధ్యక్షుడు రాజేశ్​, చరణ్, డిగ్రీ కాలేజీ కార్యదర్శి రాహుల్, అంజిరెడ్డి, శ్వేత, సౌజన్య తదితరులను సాయంత్రం దాకా అక్కడే ఉంచారు.