ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్‌‌‌‌ ఏఈఈ

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్‌‌‌‌ ఏఈఈ
  • నాలా ఎన్‌‌‌‌వోసీ ఇచ్చేందుకు రూ. 10 లక్షలు డిమాండ్‌‌‌‌
  • రూ. 7 లక్షలకు ఒప్పందం.. రూ. లక్ష తీసుకుంటూ దొరికిన గుమ్మడిదల ఏఈఈ

పటాన్‌‌‌‌చెరు, వెలుగు : నాలాకు సంబంధించిన ఎన్‌‌‌‌వోసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌‌‌‌ చేసిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ఇరిగేషన్‌‌‌‌ ఏఈఈని శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... సంతోష్‌‌‌‌ అనే వ్యక్తికి గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో కొంత భూమి ఉండగా.. దాని చుట్టూ కాంపౌండ్‌‌‌‌ వాల్‌‌‌‌ నిర్మించాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్‌‌‌‌ ఏఈఈ రవికిశోర్‌‌‌‌.. ఆ స్థలంలో నాలా ఉందని, ప్రహరీ ఎలా నిర్మిస్తావంటూ ప్రశ్నించాడు. 

కాంపౌండ్‌‌‌‌ వాల్‌‌‌‌ నిర్మాణానికి పర్మిషన్‌‌‌‌ లేదని, అప్లై చేసుకొని ఎన్‌‌‌‌వోసీ పొందాలని సూచించాడు. దీంతో సంతోష్‌‌‌‌ ఎన్‌‌‌‌వోసీ కోసం అప్లై చేశాడు. అయితే ఎన్‌‌‌‌వోసీ ఇచ్చేందుకు 10 లక్షలు ఇవ్వాలని ఏఈఈ రవికిశోర్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని సంతోష్‌‌‌‌ చెప్పడంతో రూ. 7 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఇందులో తొలి విడత కింద రూ. లక్ష ఇవ్వాలని ఏఈఈ డిమాండ్‌‌‌‌ చేశాడు. దీంతో సంతోష్‌‌‌‌ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ సిటీ రేంజ్‌‌‌‌ డీఎస్పీ శ్రీధర్‌‌‌‌ సూచన మేరకు.. రూ. లక్ష ఇచ్చేందుకు సంతోష్‌‌‌‌ శుక్రవారం పటాన్‌‌‌‌చెరు ఇరిగేషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు వచ్చి ఏఈఈని కలిశాడు. 

దీంతో ఆఫీస్‌‌‌‌లో వద్దు పార్కింగ్‌‌‌‌ ఏరియాకు రావాలని చెప్పిన ఏఈఈ.. అక్కడికి వచ్చిన తర్వాత కారు డ్యాష్‌‌‌‌ బోర్డులో డబ్బులు పెట్టాలని సూచించాడు. సంతోష్‌‌‌‌ డబ్బులు పెట్టగానే.. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఏఈఈ రవికిశోర్‌‌‌‌ను పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.