![యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ప్రమాదం.. ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు](https://static.v6velugu.com/uploads/2025/02/accident-at-yadadri-thermal-power-plantjpg1_8VRs7AnlZb.jpg)
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. రోజువారి విధుల్లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 14) ప్లాంట్‌లో బూడిద యంత్రాన్ని క్లీన్ చేస్తుండగా వేడి బూడిద కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గాయపడ్డ కార్మికులను హైదరాబాద్కు తరలించారు. వేడి బూడిద మీద పడటంతో కార్మికులు చేసిన ఆర్తనాదాలతో ప్లాంట్ దద్దరిల్లింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడ్డ కార్మికులు ఎవరు..? అసలు ప్రమాదం ఎలా జరిగింది..? అనే దానిపై ప్లాంట్ అధికారులు ఆరా తీస్తున్నారు.