ప్రముఖ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యావత్ దేశానికే తలమానికం లాంటిదని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన గురువారం దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తెలంగాణ తిరుమలగా తీర్చిదిద్దిన యాదగిరిగుట్ట ఆలయాన్ని, ఆలయ పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందల కోట్లు ఖర్చు చేసి యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించిన మాజీ సీఎం కేసీఆర్ కు, అదే ఒరవడిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అంటే దేశప్రజలందరికీ యాదగిరిగుట్ట ఆలయమే గుర్తొస్తుందన్నారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఆఫీసర్లు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.