![కొవిడ్ అందరి ఆలోచనల్నీ మార్చేసింది](https://static.v6velugu.com/uploads/2022/03/Actor-Surya-interview-on-the-ET-movie_6uHzwNZEA5.jpg)
ఓవైపు కమర్షియల్ కాన్సెప్టులు.. మరోవైపు సీరియస్ సబ్జెక్టులు.. రెండింటినీ ఒకేలా బ్యాలెన్స్ చేయగల సత్తా ఉన్న నటుడు సూర్య. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ చిత్రాలతో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. ఈసారి ‘ఇ.టి. (ఎవరికీ తలవంచడు) చిత్రంతో థియేటర్స్‌లో పలకరించబోతున్నారు. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చ్ 10న విడుదలవుతున్న సందర్భంగా కాసేపు ఇలా ముచ్చటించారు సూర్య.
- కరోనా వల్ల సినీ ఫీల్డ్‌లో చాలా మార్పులు వచ్చాయి. అందుకే నా గత చిత్రాలు రెండూ ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఒక రకంగా డిజిటల్ రంగం నిర్మాతలకు బూస్ట్ ఇచ్చింది. కొత్త దర్శకులు, రచయితలు, కొత్త కథలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. పుష్ప, భీమ్లానాయక్ లాంటి సినిమాలు థియేటర్లో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి.
- ఇ.టి. ఓ మంచి పాయింట్‌తో తెరకెక్కింది. సమాజంలో జరుగుతున్న అంశాలే ఇందులో ఉంటాయి. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతో పాటు దేశంలో ఎక్కడివారైనా కనెక్టవుతారు. మా 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో కార్తితో ఓ సినిమా తీశాడు పాండిరాజ్. అది తెలుగులో ‘చినబాబు’గా వచ్చింది. ఆ సినిమాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చూసి చాలా బాగుందని ట్వీట్ కూడా చేశారు.
- మన ఇంటికి బంధువులు వస్తే అమ్మాయితో నీళ్ళు ఇప్పిస్తారు. అబ్బాయి ఇవ్వడు. అదే విధంగా భార్యాభర్తల మధ్య చిన్న విషయాలు వస్తే సర్దుకుపోవాలని భార్యకే చెబుతారు. ఇవి ప్రతి ఇంట్లో కనిపించే విషయాలే. ఇలాంటి చిన్న చిన్న విషయాలే లోతుగా చర్చించాం. అవసరం లేని సీన్స్ వుండవు.
- రాజమౌళి, ఆయన ఫాదర్ తమ సినిమాల్లో విలనిజాన్ని హైలైట్ చేస్తారు. వారికి దానిని డీల్ చేయడం తెలుసు. మా ఇ.టి.లోనూ విలన్ సరికొత్తగా వుంటాడు. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఎమోషన్స్ కూడా ఉంటాయి. వీటన్నింటినీ దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇప్పటి జనరేషన్ కూడా బాగా కనెక్టవుతారని నా నమ్మకం. నా అభిమానుల్ని ఈ సినిమా కచ్చితంగా మెప్పిస్తుంది.
- మొదటిసారి తెలుగులో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. కాస్త డిఫరెంట్ యాసలో వుంటుంది. అది చూసి తమిళంలో కూడా ఇలా వెరైటీగా వుంటే బాగుంటుందని దర్శకుడు ఫీలయ్యాడు. దాంతో తమిళ డైలాగ్స్‌లో చిన్న చిన్న మార్పులు చేశాం.
- కొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి. బాల డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాను. వెట్రిమారన్‌తో ‘వాడివాసల్’ చేయాల్సి ఉంది. అందులో ప్రతి షాట్‌కీ కనీసం ఐదొందల మంది ఆర్టిస్టులు వుండాలి. అందుకే కరోనా టైమ్‌లో సాధ్యపడలేదు. జూన్‌లో స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం.
- ‘జై భీమ్’ ఆస్కార్‌కి వెళ్ళింది. అవార్డుకు వెళ్ళిన ఏ సినిమా అయినా యు.ఎస్.లోని మూడు రాష్ట్రాలలో ఆడాలి. కానీ కరోనా వల్ల ఓటీటీలో విడుదలైన సినిమాలను కూడా తీసుకుంటున్నారనే లాజిక్‌తో మేం వెళ్లాం. దాదాపు మూడు వేల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. వాటి ని జ్యూరీ సభ్యులు చూడాలి. వాటిలో మా సినిమా కూడా ఉండటం గర్వకారణం. మన సినిమాని చాలామంది మెచ్చుకున్నారు.