రైతు దీక్షల పేరుతో కేటీఆర్‌‌‌‌ మొసలి కన్నీరు : ఆది శ్రీనివాస్

రైతు దీక్షల పేరుతో కేటీఆర్‌‌‌‌ మొసలి కన్నీరు : ఆది శ్రీనివాస్
  • రైతులకిచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నది: ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, వెలుగు : రైతు దీక్షల పేరుతో బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తూ షో చేస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం సీఎల్పీలో మరో విప్ రామచంద్ర నాయక్‌‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌ రావు రైతు భరోసాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. పదేండ్లు రైతులను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతుల కోసం పోరాడుతుంటే నవ్వొస్తుందన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకొని అప్పుల పాల్జేసిందని ఆరోపించారు.

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతులు రుణ విముక్తి కాలేదని, కానీ తమ ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ నెల 26న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా వంటి కొత్త పథకాలను అమలు చేయబోతున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్  పాలనలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, 2014– 20 మధ్య కాలంలో తెలంగాణలో 6,121 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. 

ఫార్ములా ఈ రేస్ కేసును లొట్టపీసు కేసు అని విమర్శించిన కేటీఆర్.. ఈ కేసులో సుప్రీంకోర్టులో పిటిషన్‌‌ వేసి, వెనక్కి తీసుకోవడం అంటే నైతికంగా ప్రభుత్వం గెలిచినట్లేనన్నారు. రాష్ట్ర సర్కార్‌‌‌‌పై సోషల్‌‌ మీడియాలో బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రాంచంద్ర నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కంటే ఏడాదిలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే 
ఎక్కువన్నారు.