
- రంగంలోకి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం
- సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
- విచ్చలవిడిగా ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు
- కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ లో బల్దియా భూములు ఆక్రమణలకు గురికావడంతో పాటు అనుమతులు లేకుండానే చాలా చోట్ల భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆక్రమణలపై సీరియస్ అయ్యారు. ఆక్రమణలు గుర్తించి తొలగించాలంటూ బల్దియా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బల్ధియా అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకోసం బల్దియా ఆఫీసులో టోల్ ఫ్రీ నెంబర్ 94921 64153 ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
ఇప్పటి వరకు ఆక్రమణలపై వచ్చిన కాల్స్ కు స్పందించిన అధికారులు వాటిని తొలగించారు. కేఆర్కే కాలనీలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు, వినాయక్ చౌక్, తిర్పెల్లి, మార్కెట్ యార్డులో రోడ్డుపై అక్రమంగా వెలిసిన నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో వాటిని తొలగించారు.
టాస్క్ ఫోర్స్ టీం..
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన బల్దియా యంత్రాంగం ఆక్రమణలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసింది. పర్యవేక్షణ కోసం టీపీవో, డీఈ, శానిటరీ ఇన్స్పెక్టర్, టీపీఎస్ లను, వీరితో పాటు 12 మంది సిబ్బంది ఇందులో ఇద్దరు పోలీసులు, ముగ్గురు టౌన్ ప్లానింగ్, ఇద్దరు ఇంజనీరింగ్, ఐదుగురు శానిటరీ సిబ్బందిని నియమించారు. టోల్ ఫ్రీ నెంబర్ కు వచ్చే ఫిర్యాదులతో పాటు ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు కారణమైన రోడ్లపై తోపుడు బండ్లు, ఇతర నిర్మాణాలను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు.
ఖాళీగా ఉన్న స్థలాల కబ్జాలే కాకుండా.. మార్కెట్లో రోడ్లపై ఆక్రమంగా టేలాలు, చిన్న వ్యాపార సముదాయాలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్, వినాయక్ చౌక్, శివాజీ చౌక్, బస్టాండ్, పంజాబ్ చౌక్, రిమ్స్ ఎదుట విచ్చలవిడిగా ఆక్రమణలు జరిగాయి. వీటిపైన అధికారులు ఫోకస్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఆక్రమణలతో రోడ్లు కుచించుకుపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. టాస్క్ ఫోర్స్ ఈ ఆక్రమణలపై దృష్టి సారించిందని అధికారులు చెబుతున్నారు.
కనిపిస్తే కబ్జా..
ఆదిలాబాద్ బల్దియాలో ఖాళీ భూములు కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అటు అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తున్న పట్టించుకోవడం లేదు. బల్దియాలోని కొంత మంది అధికారుల సపోర్టుతోనే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బిల్డింగులు కడుతున్నారు. ఇటీవల మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రెండంతస్థుల భవనానికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదొక్కటే కాదు.. చాలా చోట్ల కొన్ని నిర్మాణాలు జరుగుతున్న సరైన అనుమతులు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఆక్రమణలపై చర్యలు
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై దృష్టి సారించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ భూములను కాపాడేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. పట్టణ ప్రధాన కూడళ్లలో ఆక్రమణలతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దశలవారీగా ఆక్రమణలన్నింటిని తొలగిస్తాం. మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణలు చేపట్టకూడదు. ఇప్పటికే పలు చోట్ల అనుమతులు లేకుండా నిర్మాణాలు జరగడం తో వారికి మొదటి నోటీసు అందించాం. త్వరలో అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు గుర్తిస్తాం సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్