
- జిల్లాలో వారంలోనే 8 సైబర్ కేసులు
- అత్యాశకు పోయి నిండా మునుగుతున్న అమాయకులు
- అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
- థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవద్దని హెచ్చరిక
ఆదిలాబాద్, వెలుగు : అమాయకులనే టార్గెట్ చేసి వ్యక్తిగత సమాచారం రాబట్టేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. ఇలాంటి వ్యవహారాలపై పోలీసులు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నా ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ల వారి వలలో పడి చాలా మంది తమ వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చెప్పేస్తూ రూ.వేలు, లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్లో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటుండడంతో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వరుస సైబర్ క్రైమ్ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అత్యాశకు పోయి
అమాయకులే కాదు.. కొందరు విద్యావంతులు సైతం అత్యాశకు పోయి ఆన్ లైన్లో మోసపోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. విదేశాల్లో చదువు కోసం ఓ థర్డ్ పార్టీ వ్యక్తికి జైనథ్ మండలానికి చెందిన ఓ యువతిపలు దఫాల వారీగా నగదు పంపించింది. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఇలా కొంత మంది విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
గతంలో ఫోన్ కాల్స్ ద్వారానే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు ఈ మధ్య రూటు మార్చారు. ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్, ఫేస్ బుక్ హ్యాకింగ్, ఆన్ లైన్ షాపింగ్, మార్కెటింగ్, ప్రైవేట్ లింకులు పంపుతూ మోసం చేస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్, లేదా www.cybercrime.gov.in <http://www.cybercrime.gov.in> వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈవారంలో నమోదైన కొన్ని సైబర్ కేసులు
ఆన్లైన్లో స్టాక్ మార్కెట్ ద్వారా భారీగా డబ్బు సంపాదించి పెడతానంటూ చెప్పడంతో ఆదిలా బాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ వ్యక్తి తన ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలతో కూడిన ఓ డిమాట్ అకౌంట్ తెరిచాడు. అందులో రూ.5.29 లక్షలు విడతల వారీగా జమచేశారు. అయితే ఆ డిమాట్ అకౌంట్లో నుంచి బాధితుడికి తెలియకుండా సైబర్ నేరస్తుడు నగదు దోచుకున్నాడు.
టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉండే ఓ వ్యక్తి ఆన్లైన్లో లోన్ కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్‌లో తన తన వ్యక్తిగత సమాచారం అంతా నమోదు చేశాడు. అయితే అతడి ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసిన సైబర్ నేరస్తులు తన మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఫొటోలు, వీడియోలను పంపిస్తానని బెదిరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
తాంసి మండలానికి చెందిన ఓ మహిళ ఓ వాట్సాప్ గ్రూపులో ఉన్న ఒక అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోవడంతో ఆమె వాట్సప్ హ్యాక్ అయింది. దాని ద్వారా సైబర్ నేరగాళ్లు సదరు మహిళ యూపీఐ ఐడీని వాడుకొని రూ.5 వేలు కాజేశారు.
కేవైసీ అప్డేట్ చేసుకోవాలని బ్యాంకు నుంచి ఫోన్చేస్తున్నామంటూ బజార్హత్నూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. అది నమ్మిన బాధితుడు తన వ్యక్తిగత వివరాలను పూర్తిగా చెప్పడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.19,600 వేలు దోచుకున్నారు.
వ్యక్తగత వివరాలు చెప్పొద్దు
సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను అంత తగ్గించవచ్చు. ఫోన్ల కాల్స్ ద్వారా, ఆన్ లైన్ లో, థర్డ్ పార్టీ యాప్స్‌లో వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. బ్యాంక్ అధికారులమంటూ ఫోన్లు చేస్తే నమ్మొద్దు. అనవసరైన ఆన్ లైన్ మార్కెటింగ్ లో ఇన్వెస్టిమెంట్ చేయొద్దు. జాగ్రత్తగా ఉండాలి. – అఖిల్ మహాజన్, ఎస్పీ, ఆదిలాబాద్ జిల్లా