టెంపరేచర్ 44.5 .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రికార్డు స్థాయిలో నమోదు

టెంపరేచర్ 44.5 .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రికార్డు స్థాయిలో నమోదు
  • ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలు 
  • లగ్గాలు, శుభకార్యాలపై సూర్యుడి ప్రతాపం 
  • జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ల హెచ్చరిక 

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. గత వారం రోజులు 43 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఏకంగా రికార్డు స్థాయిలో నిర్మల్ జిల్లా దస్తురాబాద్ లో 44.5 డిగ్రీలు నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిలా రాంనగర్​లో 44.4 నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.4. మంచిర్యాల జిల్లా భీమారంలో 44.3, జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్​లో 44.2, జగిత్యాల జిల్లా ధర్మపురిలో, కొమురం భీ జిల్లా బెజ్జూరులో, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 44.1 డిగ్రీల చొప్పున, కరీంనగర్ జిల్లా భూర్గుపల్లిలో 44 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలో 43 డిగ్రీలు, 12 జిల్లాల్లో 42 డిగ్రీలు, మూడు జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో వాతావరణశాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

ఆదిలాబాద్​లోనే అధికం

గత వారం పది రోజులుగా రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. గత ఐదు రోజులుగా జిల్లాలో ఉదయం 10 గంటలకే  43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం నుంచి వేడిగాలులు, ఉక్కపోతలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం5 గంటల వరకు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే వడదెబ్బ తగిలి కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది చిరువ్యాపారులతో పాటు గ్రామాలు, వీధుల్లో తిరిగి చిన్న వ్యాపారాలు చేసుకునే జీవించే వారు ఎండలకు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రాలు, పట్టణాలు సాయంత్రం వరకు నిర్మానుష్యంగా కనిపినస్తున్నాయి. గొడుగులు, కర్చీలు, తువాల, స్కార్ప్​లు లేకుండా బయకురావడం లేదు. 

లగ్గాలకు ఎండదెబ్బ

ప్రస్తుతం లగ్గాల సీజన్ నడుస్తోంది. మంచి ముహూర్తాలు ఉండటంతో చాలా మంది ఏప్రిల్​లో పెళ్లి తేదీలు ఖరారు చేసుకున్నారు. అయితే పెళ్లిళ్లు, శుభాకార్యాలపై ఎండ ఎఫెక్ట్ కనిపిస్తోంది. కుటుంసభ్యులతో కలిసి వెళ్దామంటే భయపడిపోతున్నారు. ఉదయం నుంచే ఎండల తీవ్రత ఉండటం.. ఫంక్షన్లలో ఉక్క పోతలు.. ప్రయాణాల్లో వడగాలుల కారణంగా కుటుంబంలో ఒక్కరిద్దరు మాత్రమే పెళ్లికి వెళ్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే మేచివరి వరకు 
పెళ్లిళ్ల ముహూర్తాలు ఉండటంతో అటు శుభాకార్యం పెట్టుకున్నవారితో పాటు.. అటు వెళ్లే బంధువులు సైతం టెన్షన్ పడుతున్నారు. 

అప్రమత్తంగా ఉండాలి

ఎండల తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని డాక్టర్లు సూచిస్తు
న్నారు. రానున్న రోజుల్లో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎక్కువ సేపు ఎండలో తిరగొద్దని, తాగునీరు వెంట ఉంచుకోవాలంటున్నారు. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలకు బయకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పొలం పనులకు వెళ్లే కూలీలు, రైతులు ఉదయం, సాయంత్ర వేళల్లో పనులు చేసుకోవాలని చెబుతున్నారు.