ఐటీడీఏ ఆఫీసు ముట్టడించిన ఆదివాసీలు 

మంచిర్యాల జిల్లా: పోడు భూముల సమస్యపై ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఉట్నూరు ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఎండలో పిల్లలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేసి నిరసన తెలిపారు.  ప్రజావాణి కార్యక్రమంలో పీవో వరుణ్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చి త్వరగా పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. 

పోడు భూములపై సర్వే చేసి అర్హులను గుర్తించమని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోడు భూములే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న వారిని ఇంత వరకు గుర్తించలేదని, అనేక మండలాలు.. గ్రామాల్లో సర్వేలు మాట అటుంచితే కనీసం కమిటీలు వేసి పరిశీలించలేని వాపోయారు. ఇప్పటి వరకు కనీసం 10సార్లు ఐటీడీఏ ఆఫీసుకు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.