
- బీర్కుర్, నస్రుల్లాబాద్, గాంధారి మండలాల్లో పలువురి అస్వస్థత
- నిఘా లోపంతో విచ్చలవిడిగా కల్తీ కల్లు అమ్మకాలు
కామారెడ్డి, వెలుగు : కల్తీ కల్లు విక్రయిస్తూ శ్రమజీవుల ప్రాణాలతో కొంతమంది వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. కష్టజీవులను కాటేస్తున్న కల్తీ కల్లు కామారెడ్డి జిల్లాలో కల్లోలం సృష్టిస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే బీర్కుర్, నస్రుల్లాబాద్, గాంధారి మండలాల్లో కల్తీ కల్లు తాగి పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగడం వల్ల నాలిక మొద్దు బారడం, కాళ్లు, చేతులు వంకర్లు పోవడంతోపాటు వింతగా ప్రవర్తిస్తున్నారు. చెట్ల కల్లు కంటే మత్తు కల్లు అమ్మకాలే జోరుగా సాగుతున్నాయి.
జిల్లాలోని చాలా ఏరియాల్లో ఆల్ఫ్రాజోలం కలిపి కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. గతంలో డైజోఫాం, క్లోరోహైడ్రెట్ వంటి మత్తు పదార్థాలను కల్లులో కలిపేవారు. సుమారు 10 లీటర్ల సహజ సిద్ధమైన కల్లులో పదిరేట్లకు మించి నీళ్లు కలిపి అందులో మోతాదుకు మించి మత్తు పదార్థాన్ని కలుపడం వల్ల కల్లుప్రియులు రోగాల బారిన పడుతున్నారు.
చెట్ల కల్లు తక్కువే..
జిల్లాలో సహజసిద్ధమైన చెట్ల కల్లు విక్రయాలు తక్కువే. తాగే వారి సంఖ్య అధికంగా ఉండటంతో కొద్ది పాటి కల్లులో ఆల్ఫ్రాజోలం వంటి మత్తు పదార్థాలు కలిపి కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. కల్లు డిపోల నుంచి కల్లు కంపౌండ్లకు పంపిస్తున్నారు. పొద్దంతా కాయ కష్టం చేసి సాయంత్రం అలసట పోయేందుకు ఎక్కువ మంది కల్లు తాగుతుంటారు. మత్తు కల్లుకు అలవాటు పడిన వాళ్లు కల్లు తాగకపోతే నిద్ర పోయే పరిస్థితి ఉండదు. కొందరైతే ఈ కల్లుకు బానిసై పొద్దంతా తాగుతున్నారు. మత్తు కల్లు మానేస్తే వారిలో వింత ప్రవర్తనలు చోటుచేసుకుంటున్నాయి.
కల్లు డిపోలు, షాపుల్లోనే కాకుండా కల్లీ కల్లును ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. కల్తీ కల్లు దందా జోరుగా సాగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆడపాదడపా అక్కడక్కడ దాడులు చేసి, ఒకటో, రెండో కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
మూడు రోజుల వ్యవధిలోనే పలువురు అస్వస్థత
బీర్కుర్, నస్రుల్లాబాద్, గాంధారి మండలాల్లో మూడు రోజుల వ్యవధిలోనే కల్తీ కల్లుతో 92 మంది వరకు అస్వస్థత చెందారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి కల్లు డిపోలో తయారైన కల్తీ కల్లును సేవించి ఇదే మండలంలో ని అంకోల్, అంకోల్క్యాంప్, దుర్కి, బీర్కుర్ మండలం దామరంచకు చెందిన 60 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిని బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ చేయించారు. బాధితులు కొలుకుంటున్న క్రమంలోనే గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు వ్యవహారం వెలుగు చూసింది.
మంగళ, బుధ వారాల్లో ఇక్కడ 30 మంది వరకు అనారోగ్యం పాలయ్యారు. శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతుండటంతో ఇక్కడకు చుట్టూ పక్కల గ్రామాల నుంచి బంధువులు వచ్చారు. గ్రామంలో తయారైన కల్లుతో పాటు, బాన్సువాడ ఏరియా నుంచి కొందరు కల్లును తీసుకొచ్చి తాగారు. ఈ కల్లు తాగిన పలువురు వింతగా ప్రవర్తించటం, ఇతరత్రా అనారోగ్యాలకు గురి కావడంతో వీరిని బాన్సువాడ ఏరియా హాస్పిటల్స్‌కు తరలించారు. కల్లీ కల్లు తాగి కొందరు ప్రాణాలు కూడా కొల్పోతున్నారు. రోడ్డు పక్కన షాపుల్లో కల్తీ కల్లు తాగి వెహికల్ నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.
యధేచ్ఛగా మత్తు పదార్థాల సప్లయ్..
జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, సప్లయ్ యధేచ్ఛగా సాగుతున్నది. వారం రోజలు క్రితం మద్నూర్ మండల కేంద్రంలో ఓ వ్యాపారి నుంచి భారీగా ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇతను ఇచ్చిన సమాచారంతో మత్తు పదార్థం తయారు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన వారితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్‌చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఏరియాల్లో మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలు, కల్లులో కలుపడం అధికంగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు చిన్న వ్యాపారులపై కేసులు నమోదు చేసి మమ అనిపిస్తున్నారు. పెద్ద వ్యాపారుల వైపు కన్నెత్తి చూడరన్న ఆరోపణలు జిల్లావ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ
బాన్సువాడ, వెలుగు: ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే అమాయకులు కల్తీ కల్లు బారినపడి హాస్పిటళ్లలో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో కల్తీకల్లు బాధితులను మాజీ ఎంపీ బీబీ పాటిల్ తో కలిసి పరామర్శించారు. వారి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం రాజు ఉన్నారు.
కల్తీ కల్లు కేసులో ఒకరి రిమాండ్
నస్రుల్లాబాద్, వెలుగు : కల్తీ కల్లు కేసులో ఒకరిని రిమాండ్ చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. కల్తీ కల్లు కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు చేయగా, నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన ఉడుతల లక్ష్మాగౌడ్ ను రిమాండ్‌కు తరలించామని సీఐ చెప్పారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారన్నారు. వారిని సైతం త్వరలో పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తామని సీఐ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్సై లావణ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.