యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకు చెందిన ఏయోలస్ అనే భారీ ఉపగ్రహం త్వరలో భూమిపై కూలిపోనుంది. 1360 కిలోల ఈ శాటిలైట్ జీవిత కాలం చివరి అంకానికి చేరుకుంది. దీంతో శాటిలైట్ రీఎంట్రీకి ESA శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఏయోలస్ భూమికి 320 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అయితే సూర్యుడి నుంచి వస్తున్న ప్లాస్మా గాలుల కారణంగా ఏయోలస్ త్వరగా ఇంధనాన్ని కోల్పోతోంది. దీంతో ప్రస్తుతం ఈ శాటిలైట్‌లో ఫ్యూయల్ కెపాసిటీ దాదాపు ఖాళీ అయిపోయింది.
ఎలా కూలిపోతుంది...
ప్రస్తుతం ఏయోలస్ ఉపగ్రహంలోని లేజర్ పరికరాలు ఇంకా పని చేస్తున్నాయి. దీంతో శాటిలైట్‌లో ఇతర పరికరాలను ఏప్రిల్ 30నే నిలిపివేశారు. అయితే దీనికి సంబంధించిన డేటాను పూర్తిగా సేకరించే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏయోలస్ తనంతట తానుగా 320 కిలోమీటర్ల ఎత్తు నుంచి 280 కిలోమీటర్ల ఎత్తుకు దిగనుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు శాటిలైట్‌లోని పరికరాలను ఉపయోగించి 150 కిలోమీటర్లు ఎత్తుకు దించనున్నారు. భూమి నుంచి 80 కిలోమీటర్ల ఎత్తుకు వచ్చే సరికి శాటిలైట్ దానంతట అదే కాలిపోతుందని యూరోపియన్ ఏజెన్సీ ప్రకటించింది.
ఏమైనా ప్రమాదమా..
సోలార్ యాక్టివిటీ ఆధారంగా ఏయోలస్ శాటిలైట్ కూలిపోతుందని..ఇందులో కొన్ని దశలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అగస్టు లోగా ఏయోలస్ పూర్తిగా భూమిపై కూలిపోతుందని చెప్పారు. ఏయోలస్ భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత దాని దిశను సముద్రం వైపు మళ్లించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని యూరోపియన్ ఏజెన్సీ పేర్కొంది. భూమిపై ఒక్క ముక్క కూడా పడకుండా పకడ్భందీ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీని వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగదని వెల్లడించింది.