ఇస్లామాబాద్ : అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మహిళలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో మహిళల బ్యూటీ సెలూన్‌లను నిషేధించారు. ఈ మేరకు జూన్ 24న ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ నిషేధం రాజధాని కాబూల్ తో పాటు దేశంలోని అన్ని ప్రావిన్స్‌లకు వర్తిస్తుందని లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సెలూన్‌లను, వారి వ్యాపారాలను మూసివేయడానికి నెల రోజులు గడువు ఇచ్చారు. ఆ తర్వాత తప్పనిసరిగా మూసివేయాలని, మూసివేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సూచించారు. అయితే, బ్యూటీ సెలూన్‌ల నిషేధానికి గల కారణాలను మాత్రం లేఖలో పేర్కొనలేదు.
కానీ, లేఖలోని అంశాలను తాలిబన్ మంత్రి మహ్మద్సిదిక్అకిఫ్మహజర్ మంగళవారం ధ్రువీకరించారు. అఫ్ఘనిస్తాన్‌లో మహిళల జీవితాల మెరుగుకు తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని తాలిబన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా పేర్కొన్న కొద్ది రోజులకే ఈ లేఖ రిలీజ్కావడం గమనార్హం. ఆగస్టు 2021లో అఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు మహిళలకు వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలు, బాలికలు చదువుకోవడం దగ్గర నుంచి ఉద్యోగాలు చేయడం వరకు అడుగడుగునా నిషేధాలు విధిస్తూనే ఉన్నారు. పార్కులు, జిమ్‌ల వంటి బహిరంగ ప్రదేశాలకూ రావొద్దని నిరోధించారు. మీడియా స్వేచ్ఛనూ అణిచివేశారు.