పాకిస్తాన్ కు పారిపోయిన ఆఫ్ఘన్ మహిళా ఫుట్ బాల్ టీం

పాకిస్తాన్ కు పారిపోయిన ఆఫ్ఘన్ మహిళా ఫుట్ బాల్ టీం

కాబుల్: అఫ్ఘనిస్తాన్ లో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందన్న భావన పౌరుల్లో బలంగా నాటుకుపోయింది. తాము మారిపోయామని.. అందరికీ క్షమాభిక్ష పెట్టామని చెబుతున్నా.. చేతల్లో మాత్రం అదే క్రూరత్వం.. పిచ్చి నిర్ణయాలు అమలు చేస్తుండడంతో భయం భయంగానే బతకాల్సి వస్తోంది. గత ఆగస్టు 15వ తేదీన కాబుల్ ను ఆక్రమించిన తర్వాత  అమ్మాయిలు, మహిళలు ఇళ్లు దాటి బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుపాటు మౌనంగా ఉన్నా.. భరించలేక నిరసనలకు దిగుతున్నారు. 
అమ్మాయిలకు ఆటలెందుకు అని తాలిబన్లు ప్రశ్నించడంతో మహిళా క్రీడాకారిణుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కొందరు భయంతో తమ ఇళ్లలోని జెర్సీలు, ఫోటోలను కాల్చేశారు.  దేశంలో ఉంటే చంపేస్తారని లేదా శిక్షలు వేస్తారని భయపడుతున్న ఫుట్ బాల్ మహిళా ఆటగాళ్లు ఎవరూ ఊహించని రీతిలో పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ కు పారిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ ఫుట్ బాల్ మహిళా జట్టుకు చెందిన 32 మంది క్రీడాకారిణులు, వారి కోచ్ లు కుటుంబాలతో సహా దేశం విడిచిపెట్టారు. ఖతర్ కు వెళ్లిపోదామనుకుంటే కాబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరగడంతో ఆ ప్రయత్నాలను మానుకుని సైలంట్ అయ్యారు. అయితే వీరి ప్రయత్నాలను పసిగట్టిన బ్రిటీష్ ఫుట్ బాల్ ఫర్ పీస్ ఇన్ కో ఆపరేషన్ అనే స్వచ్ఛంద సంస్థ పాకిస్తాన్ ప్రభుత్వంతోపాటు.. పాక్ ఫుట్ బాల్ సమాఖ్యతో చర్చలు జరిపి పాకిస్తాన్ కు వెళ్లేందుకు సహాయపడింది.