తుడుందెబ్బ ఆందోళన.. ఏజెన్సీ బంద్ సక్సెస్

తుడుందెబ్బ ఆందోళన.. ఏజెన్సీ బంద్ సక్సెస్

ఆదిలాబాద్/నెట్​వర్క్,​ వెలుగు: ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్‎తో ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన ఏజెన్సీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, జీవో నంబర్ 3ను కొనసాగించాలని, ఐటీడీఏలో ఉన్న బ్యాక్​లాగ్  పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఆదివాసీ పోలీస్  బెటాలియన్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా ఏజెన్సీ డీఏస్సీ నిర్వహించాలనే డిమాండ్లతో బంద్​ చేపట్టారు. తెల్లవారు జామున ఆదిలాబాద్  బస్​ డిపో ఎదుట తుడుందెబ్బ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొద్దిసేపు బస్సులు బయటకు రాలేదు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. బస్టాండ్  నుంచి కొమురం భీం చౌక్, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మీదుగా దస్నాపూర్  పెట్రోల్  బంక్​ వరకు ర్యాలీ నిర్వహించారు. 

జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి మండలాల్లో ఆదివాసీ నాయకులు ర్యాలీలు నిర్వహించి ధర్నాలు చేశారు. తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, నార్నూర్, గాదిగూడ మండల కేంద్రాల్లో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్  పాటించాయి. కాగజ్ నగర్ మండల కేంద్రంలో ప్రైవేట్  స్కూళ్లు, వ్యాపార సంస్థలు బంద్‎లో పాల్గొన్నాయి. గుడిహత్నూర్ మండల కేంద్రంలో బస్టాండ్ ఎదుట హైవేపై రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం నగేశ్  తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో ఆదిలాబాద్  జిల్లా కో కన్వీనర్ వెట్టి మనోజ్, మహిళా సంఘం కన్వీనర్  గోడం రేణుక, కో కన్వీనర్  ఉయిక ఇందిర, కాగజ్ నగర్ లో డీసీఎంఎస్  వైస్  చైర్మన్  కొమురం మాంతయ్య, ఆసిఫాబాద్  జిల్లా అధ్యక్షుడు డబ్బ బాపు పాల్గొన్నారు.