హైదరాబాద్, వెలుగు: ఈయేడు రైతుబీమాకు 49,49,254 మంది రైతులకు అర్హత ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారికంగా తేల్చింది. కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5 వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 14న రైతుబీమా గడువు ముగియనున్న నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతి యేటా ఆగస్టు 15 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 14 వరకు రైతులకు సంవత్సరం పాటు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నది.
కొత్తగా పోడు హక్కులు కలిగిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ రైతులకు ఈ యేడు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. పోడు రైతులు నిర్ణీత గడువులోగా ఏఈవోలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు కూడా గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది రైతుబీమా కలిగిన రైతులకు సంబంధించిన రెన్యూవల్స్ ఈ నెల 30 వరకు పూర్తిచేయాలని అధికారులను వ్యవసాయశాఖ ఆదేశించింది.
కొత్తగా 4.70 లక్షల మందికి పట్టాలు
ఈయేడు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చి, రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవడానికి 4.70 లక్షల మంది రైతులు అర్హత సాధించినట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. అదే విధంగా గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నా.. కొందరు రైతులకు సంబంధించిన వివరాలు అప్‌లోడ్ కాలేదు. దీంతో 8 లక్షల మంది రైతులు అర్హత ఉన్నా.. రైతుబీమా పరిధిలోకి రాలేదు. తాజాగా వీరికి కూడా ఫ్రెష్‌గా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వీరందరి డేటాను వ్యవసాశాఖ అధికారులు ఆగస్టు 5లోగా అప్‌లోడ్ చేసి.. ఎల్‌ఐసీకీ అందించాల్సి ఉంది. అలాగే, రైతుల పూర్తి వివరాలు ఏఈవోలు రైతుబీమా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. అంతేకాకుండా గతంలో బీమాకు అర్హత పొందిన 36.78 లక్షల మంది రైతుల వివరాల్లో 59 ఏండ్లు దాటినవారిని గుర్తించాల్సి ఉంది. ఎల్ఐసీ ఐడీల్లో డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ ను పూర్తి చేసి జులై30 లోపే అప్‌డేట్ చేయాల్సి ఉంది. అర్హత కోల్పోయిన వారి లెక్కనూ తేల్చాల్సి ఉంది.
నిరుడు 12.70 లక్షల మందివి రెన్యూవల్ కాలే
నిరుడు అర్హత ఉన్న 12.70 లక్షల మంది రైతుల వివరాలు రెన్యూవల్కాలేదు. ఇందులో 5 ఎకరాల లోపున్న రైతులు 7,34,463 మంది, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు మరో 65,981 మంది ఉన్నారు. వీరందరూ ఇప్పుడు ఫ్రెష్‌గా రెన్యూవల్చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. వ్యవసాయ శాఖ ఈ నెల 11న రైతుబీమా గైడ్ లైన్స్ జారీ చేసింది. రైతుబీమా ఉన్న రైతుల డేటా వెరిఫికేషన్, రెన్యూవల్ చేయడానికి ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చారు. ఎల్‌ఐసీ ఐడీ ఉన్న రైతుల డేటా రెన్యూవల్ పూర్తి చేయాల్సి ఉంది. కానీ, సైట్ ఓపెన్ కావడానికే మూడు రోజులు పట్టింది. సోమవారం నుంచే డేటా ఓపెన్ అవుతున్నది. ఆదివారం, సోమవారం రెండు రోజులు సెలవు కావడంతో మంగళవారం నుంచి పాత డేటా వెరిఫికేషన్, కొత్తగా అప్‌లోడ్ చేయాల్సిన రైతుల వివరాలు గడువులో పూర్తి చేయాల్సి ఉంది.