టూరిస్ట్ స్పాట్ గా వెలుగుమట్ల అర్బన్​ పార్క్ : తుమ్మల నాగేశ్వర రావు

  • వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం కార్పొరేషన్​ పరిధిలో ఉన్న వెలుగుమట్ల అర్బన్​ పార్క్ ను టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయనున్నట్లు  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. శుక్రవారం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి అర్బన్ పార్కును ఆయన సందర్శించారు. పార్క్ అభివృద్ధి ప్రణాళికను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి తాను పర్యటిస్తానని, అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించాలని చెప్పారు. ఖమ్మం చరిత్రకు అద్దం పట్టేలా అర్బన్ పార్కుకు మంచి పేరు పెట్టాలని సూచించారు. పార్కుకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, కొంతమంది తమ భూమి పోతుందని ఆందోళన చెందుతున్నారని, రోడ్డు వేసిన తర్వాత వారి భూమి విలువ 10 రెట్లు పెరుగుతుందని చెప్పారు. 

పార్కులో ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని, క్యాంటీన్ లో కూడా చిరు ధాన్యాలతో తయారు చేసిన పదార్థాలను పెట్టాలని, మహిళా సంఘాలచే స్టాల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్క్ స్థలం బౌండరీ ఫిక్స్​ చేసి, చూట్టూ ఫెన్సింగ్ చేయాలన్నారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పార్క్​కు  ప్రస్తుతం రోజూ వేయి మంది వరకు వస్తున్నారని తెలిపారు.  పిల్లలకు అడ్వెంచర్ గేమ్స్,  మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తే భవిష్యత్తులో రోజుకు 2 వేల నుంచి 3 వేల మంది వచ్చే అవకాశం ఉందన్నారు.

 జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్​ సింగ్ మాట్లాడుతూ గతంలో నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల ఆదాయం వస్తే ప్రస్తుతం నెలకు రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పూనుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, శిక్షణ ఐపీఎస్ రుత్విక్ సాయి, డీఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

అధికారులతో కలెక్టర్​ సమీక్ష   

వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు ఫిబ్రవరి నెలాఖరుకు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైరా హైవే రోడ్ నుంచి పార్కుకు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత భూ యజమానులతో చర్చలు జరిపి త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో ఆర్డీవో నర్సింహారావు, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్ పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖమ్మం టౌన్, వెలుగు : కేఎంసీ పరిధిలోని 3వ డివిజన్ బల్లేపల్లి జయనగర్ కాలనీలో రూ.2 కోట్లతో చేపట్టిన సైడ్ డ్రైన్ నిర్మాణం, ఖమ్మం–ఇల్లెందు ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి ఎస్సీ కాలనీ చర్చి వరకు జయనగర్ కాలనీలో రోడ్డు పురోగతి పనులు, టీయూఎఫ్​ఐడీసీ నిధులు రూ.1.25కోట్ల పీపీ రోడ్ల నిర్మాణ పనులకు  మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

ఖానాపురం, బల్లెపల్లి, బాలాపేట్ నుంచి ఖమ్మం పట్టణంలోకి వచ్చే వరద నివారణకు రూ.200 కోట్లతో ధంసలాపురం మీదుగా మళ్లీ మున్నేరు వెళ్లేలా కాల్వ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. ఖమ్మం ఖిల్లా, వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 60 ఉన్నత పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు ప్రవేశ పెట్టామని తెలిపారు.