బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి : తుమ్మల నాగేశ్వరరావు

బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి : తుమ్మల నాగేశ్వరరావు
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎనలేని సేవలందించిందని, అందువల్లనే నేడు దేశం నడుస్తోందని, బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  గురువారం ఖమ్మం నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్యనాయకులతో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ గ్రామాన ప్రతీ బూత్ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు జై బాపు.. జై భీమ్.. జైసంవిధాన్ పాదయాత్ర చేయాలన్నారు.

 బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి, అంబేద్కర్ ఆశయాలను నీరుగారుస్తూ, మహాత్మా గాంధీ స్ఫూర్తిని దెబ్బతీసేలా పరిపాలన కొనసాగుతున్న తీరును తిప్పి కొట్టడమే ఈ యాత్ర ఉద్దేశమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, 3 వ టౌన్ ఇన్​చార్జి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యర్రం బాలగంగాధర్ తిలక్, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, గజ్జల లక్ష్మీవెంకన్న, కన్నం వైష్ణవిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.