భద్రాద్రిని ధనిక జిల్లాగా రూపొందిస్తా : తుమ్మల నాగేశ్వరరావు

  • కొత్తగూడెంలో గ్రంథాలయ ప్రారంభోత్సవం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణలోనే ధనిక జిల్లాగా భద్రాద్రికొత్తగూడెం ను రూపొందించేలా  కృషి చేస్తున్నానని అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం చుంచుపల్లి మండలంలో రూ. 4కోట్లతో చేపట్టిన రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. కొత్తగూడెంలో రూ. 1.50కోట్లతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ కొత్త బిల్డింగ్​ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. జిల్లాకు త్వరలో ఎయిర్​ పోర్టు వచ్చేలా కృషి చేస్తున్నానన్నారు.

 గతంలో దుమ్ముగూడెం నుంచి ఆంధ్రప్రదేశ్​కు నౌకల ద్వారా ట్రాన్స్​పోర్టు జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్​ పూర్తి అయితే దుమ్ముగూడెం ద్వారా సరుకులు, వస్తు సామగ్రి ట్రాన్స్​పోర్టు అయ్యేలా చర్యలు చేపడుతామని చెప్పారు. భద్రాచలం సమీపంలోని సారపాక ప్రాంతంలో రైల్వే స్టేషన్​ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చుంచుపల్లి మండలంలోని గరిమెళ్ల పాడులో సెంటర్​ ఆఫ్​​ ఎక్స్​లెన్స్​ ఫర్​ ఆయిల్​ పామ్​ ఏర్పాటు చేయనున్నామన్నారు. పాల్వంచలోని మైనింగ్​ కాలేజ్​ఆఫ్ యూనివర్శిటీగా ఉన్న కాలేజీని ఎర్త్​ సెన్సెస్​ యూనివర్శిటీగా మార్పు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డిని కోరినట్లు తెలిపారు. 

రూ. 400 కోట్లతో కొత్తగూడెం చుట్టూ రింగ్​ రోడ్డు రానున్నదన్నారు. జిల్లా గ్రంథాలయంలో స్టూడెంట్స్​కు అవసరమైన బుక్స్​ ఏర్పాటు చేసేలా చూడాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్​ రియాజ్​కు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ బి.రోహిత్​ రాజు టీమ్​ చేస్తున్న కృషిని  అభినందించారు. ఈ ప్రోగ్రాంలో డీసీఎంఎస్​ చైర్మన్​ కొత్వాల శ్రీనివాస్​, అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, మున్సిపల్​ చైర్మన్​ కె. సీతాలక్ష్మి, సొసైటీ చైర్మన్​ మండే హనుమంతరావు తదితరులు ఉన్నారు.  

ప్రోటోకాల్​ రగడ.. 

జిల్లా గ్రంథాలయ సంస్థ కొత్త బిల్డింగ్​ ప్రారంభోత్సవంలో  ప్రోటోకాల్​ ప్రకారంగా వేదికలపై అఫీషియల్​గా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై మహబూబాబాద్​ ఎంపీ పోరిక బలరాం నాయక్​తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఫొటోలు పెట్టకపోవడం పట్ల పలువురు కాంగ్రెస్​ నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.  

అభివృద్ధి పనులు చేపట్టాలి

ఖమ్మం టౌన్ :  ప్రజా అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి తుమ్మల  సూచించారు. అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఖానాపురం హవేలీ నాల్గవ డివిజన్ లో చేపట్టిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన ప్రతిసారి అన్ని ప్రాంతాల ప్రజల అవసరాల మేరకు పనులు చేస్తున్నామని తెలిపారు. మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో ఖమ్మం నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 4వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి రెడ్డి, కార్పొరేటర్ కమర్తపు మురళీ, డీఎంహెచ్​వో బి. కళావతి బాయి ఉన్నారు.