- అడ్వైజరీ జారీ చేస్తూ రాజకీయ పార్టీలకు లేఖ
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో వినియోగించే ‘ఏఐ- జనరేటెడ్’, ‘డిజిటల్‌గా మెరుగుపరిచిన’, ‘సింథటిక్ కంటెంట్’, ఫొటోలు వాడితే వాటిపై లేబుల్‌లు ప్రచురించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్ వాడకం పెరిగిన నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులకు ఈసీ గురువారం అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా ‘‘డీప్ ఫేక్”, వక్రీకరించిన కంటెంట్ వాడకం నిరోధించాలని పార్టీలకు గైడ్‌లైన్స్ జారీ చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు, అభ్యర్థులు.. ప్రత్యర్థులపై రాజకీయంగా దాడి చేయడానికి ఏఐ కంటెంట్ వాడుతున్న సంగతి తెలిసిందే. ‘‘ప్రస్తుతం ప్రజల్లో అభిప్రాయాలు ఏర్పరచడంలో ఏఐ కంటెంట్ ప్రభావం చాలా ఉంటున్నది. అన్ని పార్టీలు, అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారం చేస్తున్న అంశాల్లో ఏఐ- ఉంటే అవి ఏఐ కంటెంట్ అని స్పష్టంగా తెలియజేయాలి”అని ఈసీ లేఖలో పేర్కొంది. అలాగే ఆ కంటెంట్‌లో డిస్క్లైమర్లు ఉంటే కచ్చితంగా పేర్కొనాలని స్పష్టం చేసింది. కాగా, ఏఐ వీడియోలు, ఫొటోలు, ఆడియోలు ఓటర్లను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు చెప్తున్నారు.