
- మున్నూరు కాపు మీటింగ్‌పై మీనాక్షి నటరాజన్ సీరియస్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేతలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. మాజీ ఎంపీ వీహెచ్ ఇంట్లో జరిగిన మున్నూరు కాపు మీటింగ్ కు ప్రతిపక్ష పార్టీల నేతలను పిలవడంపై ఆమె మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టించటం ఏంటని ఆమె ప్రశ్నించినట్టు సమాచారం. బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి విమర్శించడం ఏంటని రాష్ట్ర నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలను పిలవడం ఏంటని మీనాక్షి ప్రశ్నించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎల్లుండి మెదక్, మల్కాజ్గిరి సెగ్మెంట్ మీటింగ్
మెదక్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ మీటింగ్ మంగళవారం గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్నది. మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ మీటింగ్, సాయంత్రం 5 గంటలకు మల్కాజ్ గిరి మీటింగ్ ఉండనున్నది. ఈ మీటింగ్ కు చీఫ్ గెస్ట్ గా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ అటెండ్ కానున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు.
ఈ సమావేశంలో పార్లమెంట్ పరిధిలోని మంత్రులు, ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరుకానున్నారు. అదేవిధంగా, అనుబంధ సంఘాల చైర్మన్ లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాల్లో ఉన్న నాయకులు, సీనియర్ లీడర్లు కూడా పాల్గొననున్నారు.