మల్లన్న పూజలు ప్రారంభం

వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు : హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి పూజలు ఆదివారం ప్రారంభమయ్యాయయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు, టేస్కాబ్​ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు వారికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం స్వామి వారి కండువా కప్పి వేదమంత్రాలతో అందరినీ ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుని ఉత్సవాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి కొండా సురేఖ సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, ధర్మకర్తలు, ఆలయ ఈవో నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మల్లన్న బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ సభ్యులతో ఈవో కార్యాలయంలో సమావేశమయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉత్సవ కమిటీ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ తోపాటు సభ్యులకు సూచించారు.

కాగా, హనుమకొండ కలెక్టరేట్​కు వెళ్తున్న ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే నాగరాజు ఘనంగా స్వాగతం పలికి, సత్కరించారు. ఐనవోలు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్, వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్​ నరకుడు వెంకటయ్యను మంత్రికి పరిచయం చేశారు. వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు.