T20 World Cup 2024: జడేజాకు హ్యాట్సాఫ్.. డబ్బు తీసుకోకుండానే ఆఫ్ఘనిస్తాన్‌కు సేవలు

T20 World Cup 2024: జడేజాకు హ్యాట్సాఫ్.. డబ్బు తీసుకోకుండానే ఆఫ్ఘనిస్తాన్‌కు సేవలు

భారత్ వేదికగా 2023 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ మెంటార్ గా భారత మాజీ స్టార్ అజయ్ జడేజా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మెంటార్ గా ఈ మాజీ ప్లేయర్ సఫలమయ్యాడనే చెప్పాలి. వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాలను సాధించింది. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లకు షాకిచ్చి చివరి వరకు సెమీస్ రేస్ లో నిలిచింది. ఆస్ట్రేలియాపై గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయిన ఆఫ్ఘనిస్తాన్.. సెమీస్ అవకాశాలు పోగొట్టుకుంది.

ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ విజయాల వెనుక జడేజా కీలక పాత్ర పోషించాడు. మెంటార్ గా ఆఫ్ఘనిస్తాన్ జట్టును ముందుండి నడిపించాడు. భారత పరిస్థితులపై అవగాహన కల్పించి విజయం సాధించగలమని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అయితే ఆఫ్ఘన్ జట్టు కోసం ఇన్ని సేవలు చేసిన జడేజా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. తాజాగా ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నసీబ్ ఖాన్  తెలిపారు.
         
"మేము చాలాసార్లు డబ్బులు తీసుకోవాల్సిందిగా కోరాము. కానీ జడేజా 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో అతని సేవలకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ నుండి డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు. జట్టు బాగా ఆడితే చాలు అదే నాకు బహుమతి అని జడేజా అన్నాడు". అని నసీబ్ ఖాన్ తెలిపాడు. దీంతో ప్రస్తుతం ఈ మాజీ భారత  ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. 53 ఏళ్ల జడేజా తన కెరీర్‌లో భారత్ తరపున 196 వన్డే మ్యాచ్ లాడాడు. 37.47 యావరేజ్ తో 5359 పరుగులు చేశాడు.ఇందులో ఆరు సెంచరీలతో పాటు 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి.