
- వీసీ పదవిని రూ.2 కోట్లకు అమ్ముకుంటున్నరు
- వీసీలంతా కేసీఆర్‌కు భజన చేస్తున్నరు
- కేయూలో పీహెచ్డీ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్
హనుమకొండ, వెలుగు: పోలీసులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే, అన్యాయాన్ని ఎదిరించడానికి మళ్లీ తుపాకులు పట్టుకోవాల్సి వస్తుందని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం బాధాకరమని, వరంగల్సీపీ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారా? లేక కేసీఆర్చెప్పింది వింటున్నారా? అని ప్రశ్నించారు. పీహెచ్డీ అక్రమాలపై విచారణ జరపడంతో పాటు విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేయూ స్టూడెంట్ జేఏసీ చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు.
అనంతరం వరంగల్ ప్రెస్ క్లబ్లో ‘జాగో తెలంగాణ’ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రెండు చోట్ల ఆకునూరి మాట్లాడారు. ప్రభుత్వ యూనివర్సిటీలను సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గజదొంగల్లాగా దోచుకుతింటున్నారని మండిపడ్డారు. విద్యార్థులు 18 రోజులుగా దీక్ష చేస్తున్నా వీసీ రమేశ్, రిజిస్ట్రార్ శ్రీనివాసరావు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. పీహెచ్డీ ఇంటర్వ్యూలకు 30 మార్కులు కేటాయించారంటే అవినీతి, అక్రమాలకు తెరలేపినట్టేనన్నారు. ‘‘వీసీ పదవిని రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్లకు అమ్ముకుంటున్నారు. వీసీలంతా సీఎంకు భజనపరులుగా మారారు” అని ఆరోపించారు. దీంతోనే వర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోందన్నారు. వీసీ, రిజిస్ట్రార్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని.. పీహెచ్డీ అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుంటున్నది..
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం.. కులాలు, మతాల పేరుతో విద్వేషాలు సృష్టిస్తున్నాయని ఆకునూరి మురళి ఆరోపించారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తామేమీ కాంగ్రెస్ కు అనుకూలం కాదని స్పష్టం చేశారు. ‘‘బీజేపీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోంది. ఉత్తర భారత్‌ను అంబానీకి, దక్షిణ భారత్‌ను అదానీకి అప్పగించింది. బీఆర్ఎస్దోపిడీ వల్ల రాష్ట్రం ముందుకు పోవడం లేదు. కేసీఆర్ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోంది” అని ఆరోపించారు. కేసీఆర్ కేవలం ఒక్క శాతం జనాభాకు న్యాయం చేసి, మిగతా 99 శాతం జనాలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ లాంటి దుర్మార్గ, అవినీతి, మోసపూరిత పరిపాలన ఇప్పటి వరకు చూడలేదన్నారు. ‘జాగో తెలంగాణ’ సమావేశంలో జస్టిస్చంద్రకుమార్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్లు పద్మజా షా, వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.