
- 65వేల మందికి బీపీ, 27వేల మందికి షుగర్
- 59 మందికి క్యాన్సర్ నిర్ధారణ
- లైఫ్స్టైట్, డైట్లో మార్పులే కారణమంటున్న డాక్టర్లు
- ఈ వ్యాధులను కంట్రోల్చేయకపోతే కొత్త రోగాల ముప్పు
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో బీపీ, షుగర్బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో యాభై, అరవై ఏండ్లలో వచ్చే ఈ వ్యాధులు ఇటీవల కాలంలో 30 సంవత్సరాలు దాటగానే చుట్టుముడుతున్నాయి. నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు ఆలవాట్లలో చోటుచేసుకుంటున్న మార్పులే దీనికి కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఒక్కసారి బీపీ, షుగర్వచ్చినట్లయితే లైఫ్లాంగ్మెడిసిన్వాడుతూ ఇబ్బందులు పడాల్సిందేనని.. అంతేగాకుండా ఇవి అనేక రకాల కొత్త రోగాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.
90 శాతం మందికి లైఫ్స్టైల్లో మార్పుల కారణంగానే..
ఇటీవల పెరుగుతున్న నాన్కమ్యూనికబుల్డిసీజ్(ఎన్సీడీ)లపై నేషనల్ హెల్త్‌మిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటిని కంట్రోల్చేసేందుకు ఎన్సీడీ క్లినిక్‌లతో పాటు అన్ని గవర్నమెంట్హాస్పిటల్స్లో హెల్త్ డిపార్ట్మెంట్సర్వే నిర్వహిస్తోంది. మంచిర్యాల జిల్లా జనాభా 8 లక్షలు కాగా, 30 సంవత్సరాలు పైబడినవాళ్లు 4 లక్షల 62 వేల 302 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 3లక్షల 95 వేల 408 మందిని వివిధ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో స్ర్కీనింగ్చేశారు.
ఇందులో 65 వేల 747 మందికి బీపీ(రక్తపోటు), 27 వేల 29 మందికి షుగర్(డయాబెటిస్) ఉన్నట్టు తేలింది. బాధితుల్లో 40 నుంచి 70 సంవత్సరాల లోపువారు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు గుర్తించారు. 90 శాతం మందికి లైఫ్స్టైల్లో మార్పుల కారణంగా, 10 శాతం మందికి మాత్రమే జెనెటికల్‌గా వచ్చినట్టు తేల్చారు. బాధితులకు అన్ని సర్కారు దవాఖానాల్లో నెల వారీగా మెడిసిన్ అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
పెరుగుతున్న క్యాన్సర్ పేషెంట్లు
జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతున్నట్టు హెల్త్ డిపార్ట్మెంట్సర్వేలో వెల్లడైంది. ఇప్పటివరకు 16 మందికి ఓరల్క్యాన్సర్, 34 మందికి బ్రెస్ట్ క్యాన్సర్, తొమ్మిది మందికి సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. వ్యాధి తీవ్రతను బట్టి హైదరాబాద్‌లోని వివిధ హాస్పిటల్స్‌కు రెఫర్చేశారు. క్యాన్సర్ పేషెంట్ల కోసం మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో పాలియేటివ్వార్డు ఉంది. మెడికల్ ఆఫీసర్, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
బీపీ, షుగర్‌కు ప్రధాన కారణాలివే..
ఉద్యోగ, వృత్తి రంగాల్లో పోటీపడి రాణించేందుకు 8గంటల కంటే ఎక్కువ టైమ్పనిచేస్తూ ఫిజికల్‌గా, మెంటల్‌గా ఒత్తిడికి గురవుతున్నారు. వాకింగ్, జాగింగ్, యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్లు చేయకపోవడం బీపీ, షుగర్‌కు కారణమవుతోంది. అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడం.. ఉప్పు, ఆయిల్, షుగర్ఎక్కువగా తీసుకోవడం, జంక్ఫుడ్తినడం, బరువు పెరగడం (ఒబేసిటీ) వల్ల కూడా ఈ వ్యాధులు వస్తున్నాయి.
గతంలో టౌన్లలో ఎక్కువ మంది బీపీ, షుగర్పేషెంట్లు ఉండగా, ఇటీవల పల్లెల్లోనూ బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, పోషకాలున్న ఆహారం తీసుకోవడం, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండడం, రెగ్యులర్‌గా యోగా, ఎక్సర్సైజ్లు చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.