నాంపల్లిలో నుమాయిష్ షురూ

 నాంపల్లిలో నుమాయిష్ షురూ
  • ఎగ్జిబిషన్​ను ప్రారంభించిన మంత్రులు శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్
  • ఎగ్జిబిషన్​ ఆదాయంతో విద్యా సంస్థలు నిర్వహించడం అభినందనీయం
  •   కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేస్తామని వెల్లడి

బషీర్ బాగ్, వెలుగు :  నాంపల్లిలోని ఎగ్జిబిషన్ ​గ్రౌండ్​లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన–84(నుమాయిష్) మొదలైంది. మంత్రి పొన్నం ప్రభాకర్, నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి డి.శ్రీధర్ బాబు శుక్రవారం ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. నుమాయిష్ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో విద్యాసంస్థలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తితో ఎగ్జిబిషన్ సొసైటీ బాలికల విద్యను ప్రోత్సహిస్తోందని చెప్పారు.

సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంజినీరింగ్ అడ్మిషన్లు చేపడతామన్నారు. నుమాయిష్ 84వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ ఎగ్జిబిషన్ కు ఏటా దాదాపు 25 లక్షల మంది వస్తారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లభించే అన్ని రకాల వస్తువులను నుమాయిష్ లోని రెండు వేల స్టాల్స్ లో ఏర్పాటు చేశారు” అని తెలిపారు. నుమాయిష్ కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించిందన్నారు. కాగా, ఈ ఎగ్జిబిషన్ 47 రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కొనసాగుతుంది. 

రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు పెట్టాలి: మహేశ్ గౌడ్ 

నుమాయిష్ ఎగ్జిబిషన్ పేదలకు ఎంతో వినోదం అందిస్తున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విద్యాసంస్థలు పెట్టేందుకు ముందుకురావాలని కోరారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని రెండు ఫంక్షన్ హాల్స్ ను మరింత అభివృద్ధి చేయాలన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, మహిళా కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె. నిరంజన్, కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి తదితరులు 
పాల్గొన్నారు. 

2 వేల స్టాళ్లు ఏర్పాటు.. ఎంట్రీ ఫీజు రూ.50

నుమాయిష్​లో ఈసారి రెండు వేల స్టాళ్లు ఏర్పాటు చేయగా ఎంట్రీ ఫీజును రూ.50గా నిర్ణయించారు. మినీ ట్రైన్ తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్​కొనసాగుతుంది.

సొసైటీకి సహకారం అందిస్తం: మంత్రి పొన్నం 

ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం 20 విద్యాసంస్థలు కొనసాగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వచ్చే ఏడాది కల్లా విద్యాసంస్థలు 30కి చేరేలా కృషి చేయాలని సూచించారు. అవసరమయ్యే అనుమతులు, ఇతరత్రా సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎగ్జిబిషన్ స్థలం లీజు విషయమై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతామన్నారు. కరోనా నుంచి నిలిపివేసిన క్రీడా పోటీలు, వెటర్నరీ హెల్త్ కాంపిటిషన్లను తిరిగి నిర్వహించేందుకు సొసైటీ చర్యలు తీసుకోవాలని సూచించారు.