అన్ని పార్టీలదీ బీసీ నినాదమే .. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలపైనే ఫోకస్​

అన్ని పార్టీలదీ బీసీ నినాదమే .. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలపైనే  ఫోకస్​
  • కులగణన, వర్గీకరణ, పథకాల అమలు అంశాలతో ప్రజల్లోకి కాంగ్రెస్
  • కులగణన బోగస్ అంటూ విమర్శలతో బీఆర్ఎస్..
  • భవిష్యత్తులో బీసీ అభ్యర్థే సీఎం అంటూ బీజేపీ..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.  అన్ని  పార్టీలు ప్రధానంగా బీసీ, వర్గీకరణ అంశాలపై ఫోకస్ పెడుతున్నాయి.  రాష్ట్రమంతా కులగణన చుట్టే పాలిటిక్స్ ​తిరుగుతున్నాయి.  స్థానిక ఎన్నికల్లో ‘బీసీ’ అంశమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లేందుకు పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వే వివరాలు వెల్లడించడంతో లోకల్​ బాడీ ఎలక్షన్స్​లో  ఈ అంశం ప్రధానాస్త్రంగా మారింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేయలేదని, ఇచ్చిన మాటప్రకారం తాము చేసి చూపించామని ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్​ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ.. కులగణన సర్వే తీరుపై విమర్శలు చేస్తున్నది.  కుల గణన సర్వే సరిగా చేయలేదని, బీసీ జనాభా లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని ప్రభుత్వాన్ని ఎండగడుతున్నది. 

ఇది బీసీ వ్యతిరేక సర్కార్ అంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీసీ నేతలను సమాయత్తం చేస్తున్నది.  ఇక కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. తెలంగాణలో గ్రామస్థాయిలోకి వెళ్లేందుకు బీసీ అంశాన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నది. భవిష్యత్తులో తమ పార్టీ గెలిస్తే బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అని ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇచ్చి.. తద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. కాగా, బీసీ నేతలు ఆర్. కృష్ణయ్య.. పార్టీలతో  సంబంధం లేకుండా ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్న కూడా  బీసీ జపం చేస్తున్నారు. బీసీ ఓటర్లను  ఆకర్షించడమే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తున్నారు.  బీసీల విషయంలో వీరిని ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్నాయా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. 

ఇటు కులగణన.. అటు పథకాల అమలు.. 

అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు కులగణన, అటు 4  పథకాలను ఒకే రోజు ప్రారంభించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ ఇచ్చిన మాట అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్​ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా శాస్త్రీయంగా, సమగ్రంగా, పకడ్బందీగా కుల గణనను నిర్వహించి.. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీల జనాభా లెక్కలు తేల్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కుల గణన చేశామని ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.  

సంక్షేమ, అభివృద్ధి పనులకు కుల గణన డేటా ఉపయోగంగా ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా బీసీలకు 42 శాతం  రిజర్వేషన్‌‌‌‌ను రాజకీయంగా కల్పిస్తామని, లీగల్ గా చిక్కులు వచ్చినా పార్టీపరంగా న్యాయం చేసి.. మాటకు కట్టుబడి ఉంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్​ కార్డుల జారీ ప్రక్రియను ఒకేరోజు ప్రారంభించింది.  ఈ పథకాలను గడప గడపకూ అందించాలని ఇప్పటికే కాంగ్రెస్​ అధిష్టానం.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసింది.  ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధుల ద్వారా కుల గణన అంశంతోపాటు 4 పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నది. 

బీఆర్ఎస్ ‘బీసీ’ అస్త్రం 

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. పార్లమెంట్​ ఎన్నికల్లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.  ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా కనీసం పరువు నిలుపుకోవాలని బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెట్టింది.  ప్రభుత్వం బహిర్గతం చేసిన కుల గణన లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని ఆ పార్టీ  బీసీ నేతలతో విమర్శలు చేయిస్తున్నది.  ఈ సర్వే పెద్ద బోగస్ అంటూ బీసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నది. ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వమని ముద్ర వేసేందుకు బీసీలను ప్రధానాస్త్రంగా వినియోగించుకుంటున్నది.  బీసీలకు కాంగ్రెస్​ సర్కారు అన్యాయం చేస్తున్నదని, అందుకే జనాభా లెక్క తక్కువ చేసి చూపిస్తున్నదని, 42% రిజర్వేషన్ హామీ తుంగలో తొక్కిందంటూ విమర్శలు గుప్పిస్తున్నది. బీసీల అంశాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకుంటే .. బీఆర్ఎస్ మాత్రం అదే అస్త్రాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నది. కుల గణన ప్రక్రియ కాంగ్రెస్‌‌‌‌కు ప్రతికూలంగా చేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నది.  లోకల్​బాడీ ఎలక్షన్స్​ సమీపిస్తున్న నేపథ్యంలో బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. 

బీసీ సీఎం నినాదంతో బీజేపీ ముందుకు..

కులగణన అంశంపై బీజేపీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నది.  పార్టీ బలోపేతంతోపాటు రాష్ట్రంలో తమ పార్టీ పాగా వేసేలా వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తానని ఇప్పటికే ప్రకటించగా.. ఇక రాష్ట్ర అధ్యక్ష  పదవిని సైతం బీసీకే ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో బీజేపీ స్టేట్ చీఫ్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్​ని నియమించిన విషయాన్ని గుర్తు చేస్తున్నది. త్వరలో ప్రకటించబోయే స్టేట్ చీఫ్ కూడా బీసీ వ్యక్తే అనే సంకేతాలు ఇచ్చింది.    కుల గణనపై చర్చలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా బీసీ జనాభాను తక్కువ చేసి చూపించిందని ఆరోపించారు. దీంతో బీసీల నుంచి మద్దతు లభిస్తుందని ఆ పార్టీ భావిస్తున్నది.  

పార్టీతో సంబంధం లేకుండా..

పార్టీ లైన్‌‌‌‌కు భిన్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ అంశాన్ని ఎత్తుకున్నారు. ఏడాది క్రితమే యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీ సంఘాలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. తరచూ వారితో సమావేశమవుతూ కాంగ్రెస్ 42శాతం హామీపై ఒత్తిడి తేవాలని దిశానిర్దేశం చేశారు. బీసీ సంఘాలతో పలుమార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం   ప్రభుత్వం వెల్లడించిన కుల గణన గణాంకాలను తప్పుల తడక అని విమర్శించారు.  ఇటీవల హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో బీసీలతో కలిసి భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు.