
ప్రతి రోజూ వార్తల్లో ప్రముఖంగా నిలిచే అంశాలు జనరల్ స్టడీస్, ఇతర సబ్జెక్ట్స్‌తో ఇంటర్ లింకై ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. కాన్సెప్ట్స్‌తోపాటు ముఖ్యమైన అంశాలకు సంబంధించిన నేపథ్యంతో కలిపి చదవాలి. అప్పుడే అన్ని సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో పట్టు లభిస్తుంది. అందుకే రోజువారీ ప్రిపరేషన్‌లో కరెంట్ అఫైర్స్‌ను భాగం చేసుకొని ఎప్పటికప్పుడు చదవాలి. గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల దృష్ట్యా కరెంట్ అఫైర్స్‌తోపాటు మిగతా అంశాలను మిళితం చేసి ఎలా చదువుకోవాలో చూద్దాం.
న్యూస్ పేపర్‌లో వచ్చే ప్రతి అంశం ముఖ్యమైంది కాదు. అన్ని వార్తలు పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కూ పనికిరావు. సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన, బేసిక్స్‌పై పట్టు ఉన్నప్పుడే న్యూస్ పేపర్‌లో ఎగ్జామ్‌కు పనికి వచ్చే అంశాలను గుర్తించగలుగుతారు. సబ్జెక్ట్‌ను అప్‌డేట్ చేసుకోగలుగుతారు. ఉదాహరణకు ఇటీవల ఏకో సెన్సిటివ్ జోన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎకోసెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్) సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పర్యావరణానికి సంబంధించింది. న్యూస్‌పేపర్‌లో వచ్చిన వార్తను చదివి వదిలేయకుండా ఈ అంశం వార్తల్లో ఎందుకుంది? ఏకో సెన్సిటివ్ జోన్ అంటే ఏమిటి? ఇక్కడ ఏయే కార్యకలాపాలకు అనుమతిస్తారు? ఎలాంటి వాటిని అనుమతించరు? ఈఎస్‌జెడ్ కీలకాంశాలు? ఎదురవుతున్న సవాళ్లు? సుప్రీంకోర్టు పరిశీలనలు? ఉత్తర్వులు ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు ఈ ప్రశ్నలను అడగవచ్చు.
ఎకో సెన్సిటివ్ జోన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రంలో ఎవరు అమలు చేస్తారు?
జవాబు: ప్రిన్సిపల్ కన్జర్వేటర్ చీఫ్ ఆఫ్ ఫారెస్ట్ లేదా హోం సెక్రటరీ
ఎకో సెన్సిటివ్ జోన్‌ను ఎవరు ప్రకటిస్తారు? ఏ చట్టం ప్రకారం?
జవాబు: పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రకటిస్తుంది. పర్యావరణ పరిరక్ష చట్టం -1986
అంతర్జాతీయ అంశాలు కీలకం
అంతర్జాతీయ పరిణామాలు, వాటి ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుందనే కోణంలో అంతర్జాతీయ అంశాలను చదవాలి. ఉదాహరణకు అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ దేవిశక్తి, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య దృష్ట్యా ఆపరేషన్ గంగ వంటి అంశాలపై దృష్టి సారించాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలు, కీలకమైన ఒప్పందాలను చదవాలి. యూఎన్ఓ, యూఎన్‌ఎస్‌సీ, ఈయూ, ఐఏఈఏ, యూఎన్‌హెచ్‌ఆర్‌సీ, నాటోతోపాటు ముఖ్యమైన నివేదికలు, సూచీలు, నౌకా, వైమానిక, సైనిక విన్యాసాలు తదితర అంశాలను ప్రత్యేకంగా నేర్చుకోవాలి. ఉదాహరణకు 13 దేశాలతో ఇండో పసిఫిక్ ఫ్రేమ్ వర్క్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో ఇండియా కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది అంతర్జాతీయ అంశాలు, ఎకనామీ పాయింట్ ఆఫ్‌లో ఎంతో కీలకం. ఇండో పసిఫిక్ ఫ్రేమ్ వర్క్(ఐపీఈపీ) అంటే ఏమిటి? లక్షణాలు, భారత్-ఐపీఈపీ, ఇది భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడబోతోంది? ఏ సందర్భంలో నిర్ణయం తీసుకున్నారు? క్వాడ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు? తెలుసుకోవాలి.
హిస్టరీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
హిస్టరీ స్టాటిక్ సబ్జెక్టును డైనమిక్ అంశాలతో కలిపి చదువుకోవాలి. 75ఏళ్ల స్వాతంత్ర్యోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రత్యేకంగా చదువుకోవాలి. ఇటీవల సింధు నాగరికత ప్రారంభమైన ధోలవీరా, కాకతీయుల కాలానికి చెందిన రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెలుగులోకి తీసుకువస్తున్న అంశాలను ప్రత్యేకంగా నేర్చుకోవాలి. ఇటీవల హైదరాబాద్‌లో అతిపెద్ద రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనిదృష్ట్యా రామానుజాచార్యుల తత్వ సిద్ధాంతాలు, ప్రత్యేకతలను నేర్చుకోవాలి.
జాగ్రఫీని జాగ్రత్తగా చదవాలి
ప్రపంచ, భారత, తెలంగాణ జాగ్రఫీ సంబంధించిన అంశాలు రోజూ వార్తల్లో నిలుస్తుంటాయి. ఉదాహరణకు ఆదిమతెగ ప్రత్యేకంగా భిల్లుప్రదేశ్ కావాలని కోరుతున్నారు. అసలు భిల్లు ప్రదేశ్ డిమాండ్ ఏ విధంగా వచ్చింది? చారిత్రక నేపథ్యం? దేశంలో భిల్లు తెగలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే సవాళ్లు? తదితర అంశాలను నేర్చుకోవాలి. అలాగే, విపత్తు సంబంధిత ప్రదేశాలపై సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. ఉదాహరణకు భూకంపాలు, అగ్నిపర్వాతాల విస్ఫోటనం జరిగినప్పుడు వాటికి సంబంధించిన బేసిక్స్‌తో సహా నేర్చుకోవాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీలో వర్తమానం
చైనా కృత్రిమ సూర్యుడు టోకోమక్ ప్రత్యేకతలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మార్స్‌పై వివిధ దేశాల పరిశోధనలు, ఇస్రో ప్రయోగాలపై పట్టు పెంచుకోవాలి. ఆవిష్కరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వైరస్‌ల కారణంగా ప్రపంచం వణికిపోతున్నది. కరోనా వైరస్ భయం వీడకముందే మంకీ వైరస్ వ్యాపిస్తోంది. వైరస్ వల్ల వచ్చే వ్యాధులు, డీఎన్‌ఏ ఆధారిత వైరస్, ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వైరస్‌లు అంటే ఏమిటి? వ్యాక్సిన్‌ల తయారీ, సంస్థలు, వ్యాక్సిన్‌ల ప్రత్యేకతలపై దృష్టి సారించాలి.
బడ్జెట్, ఆర్థిక సర్వే కీలకం
కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లు, ఆర్థిక సర్వేలు కరెంట్ ఎకానమీలు చాలా కీలకం. అత్యధిక ప్రశ్నలు వీటి నుంచే అడుగుతారు. బడ్జెట్ ప్రత్యేకతలు, ఈ సంవత్సరం బడ్జెట్‌లో పేర్కొన్న కొత్త పథకాలు, ఈ సంవత్సరం బడ్జెట్‌కు పిల్లర్స్‌గా పేర్కొనే అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆర్థిక సర్వేను ఎకానమీకి లింక్ చేసి చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు.
డైలీ పేపర్ రీడింగ్ కంపల్సరి
చాలా మంది అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ అంటే చివరలో ఏదో ఒక మ్యాగజైన్ చదివితే సరిపోతుంది అనుకుంటారు. ఇది ఎంత మాత్రం సరికాదు. ప్రతిరోజు పేపర్ చదవకుండా మ్యాగజైన్‌పై ఆధారపడటం వల్ల కంటిన్యుటీ పోతుంది. అంతేకాకుండా ఒకేసారి నెల, ఆరు నెలలు కరెంట్ అఫైర్స్ చదవడం కూడా భారంగా మారుతుంది. ఇది మొత్తంగా ప్రిపరేషన్‌ను దెబ్బ తీస్తుంది. కాబట్టి, ప్రతిరోజు పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి.
పాలిటీలోనే ఎక్కువ ప్రశ్నలు
కరెంట్ అఫైర్స్‌లో పాలిటీ అంశాలు వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంటాయి. రాష్ట్రపతి ఎన్నిక, వివాదాస్పదమవుతున్న గవర్నర్ వ్యవస్థ, కర్ణాటకలో హిజాబ్ వివాదం, 104వ రాజ్యాంగ సవరణ తదితర అంశాలను మూలాల్లోకి వెళ్లి చదవాలి. ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకుని న్యాయస్థానాలు తీర్పులు ఇస్తున్నాయో క్షుణ్ణంగా పరిశీలించాలి. ఉదాహరణకు నీట్ బిల్లుపై తమిళనాడు గవర్నర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. సందర్భం ఏమిటి? బిల్లులపై గవర్నర్‌కు ఉన్న అధికారాలు? రాజ్యాంగం ఏం చెబుతోంది? గవర్నర్ దగ్గరకు బిల్లు వెళ్లినప్పుడు ఆయనకున్న ఆప్షన్స్? ఏదైనా బిల్లును రాష్ట్రపతికి సిఫారసు చేసినప్పుడు రాష్ట్రపతి ఏం చేయవచ్చు? తదితర అంశాలను చదవాలి. మరోసారి చర్చల్లోకి వచ్చిన ప్రకరణ 44 గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాలి.