- అందరి నోటా అవినీతి మాట
- స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని పార్టీలకతీతంగా ఆరోపణలు
- ఎంక్వైరీకి మూడు పార్టీల డిమాండ్
- తాజాగా కలెక్టర్‌కు మాజీ మేయర్ ఫిర్యాదు
- అదే బాటలో మిగతా పార్టీల నాయకులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ తాజా మాజీ మేయర్ సునీల్ రావు.. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలోకి చేరినప్పటి నుంచి స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి వ్యవహారం తెరపైకి వచ్చింది. గత రెండు, మూడేళ్లుగా స్మార్ట్ సిటీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ లీడర్లు అడపాదడపా ఆరోపిస్తున్నప్పటికీ.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఇప్పుడు అదే రాగం ఎత్తుకోవడం చర్చనీయాంశంగా మారింది. అందరూ అవినీతి గురించే మాట్లాడితే.. ఆ అవినీతికి బాధ్యులెవరని నగరవాసులు చర్చించుకుంటున్నారు. కాగా స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిపై విచారణ చేయాలని మాజీ మేయర్ సునీల్‌రావు బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
నాసిరకమైన పనుల్లో కొన్ని..
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1.20 కోట్లతో పలుచోట్ల ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ స్మార్ట్ బిన్స్ ను పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. ఈ బిన్స్ 50 శాతం ఫిల్ కాగానే కాంపక్టర్ స్టేషన్ కు మెస్సేజ్ వెళ్లాలి. టెక్నీషియన్ వెహికల్ తో వచ్చి ఎస్కవేటర్ సాయంతో అందులో చెత్తను తీసుకెళ్లాలి. తుప్పు పట్టడంతో పారిశుద్ధ్య కార్మికులే మాన్యువల్ గా తీయాల్సి వస్తుంది. సెన్సార్ పని చేయక మెస్సేజ్ వెళ్లడం లేదు.
కరీంనగర్ మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డులో చెత్తను పూర్తిగా రీసైక్లింగ్ చేసి.. స్థలాన్ని కార్పొరేషన్ కు అప్పగించాల్సి ఉంది. ఇందుకోసం రూ.16 కోట్లు స్మార్ట్ సిటీ ఫండ్స్ కేటాయించారు. 2022 జూన్ లో పనులు ప్రారంభించగా.. అగ్రిమెంట్ ప్రకారం ఏడాదిలోగా పూర్తిగా క్లీన్ చేయాలి. కానీ రెండున్నరేళ్లయినా పూర్తి కాలేదు.
నాకా చౌరాస్తా జంక్షన్ ఫౌంటెయిన్, ఎల్ఈడీ లైటింగ్ పని చేయడం లేదు. ఇదే చౌరాస్తా లో సప్లిమెంటరీ పనుల కింద పూల మొక్కలు నాటి రూ.6.64 లక్షల బిల్లులు పొందారు.
స్మార్ట్ సిటీలో చేపట్టిన అత్యంత ఎక్కువగా ఇందిరా చౌక్ జంక్షన్ బ్యూటిఫికేషన్ కు ఖర్చు పెట్టారు. ఈ జంక్షన్ అభివృద్ధికి తొలుత రూ.40 లక్షలతో ప్రతిపాదించగా.. ఆ తర్వాత రూ.1.20 కోట్లకు(మూడింతలు) పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ జంక్షన్ పనులు నాసిరకంగా చేపట్టడం కారణంగా మల్టీ కలర్ లైటింగ్ రావడం లేదు. ఇందులో రెయిలింగ్ కూడా థర్డ్ గ్రేడ్ వాడారనే ఆరోపణలు ఉన్నాయి.
నాకా చౌరస్తా నుంచి బొమ్మా వెంకన్న బిల్డింగ్‌కు వెళ్లే దారితోపాటు అక్కడక్కడ స్మార్ట్ స్ట్రీట్ లైట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
ALSO READ : వ్యవసాయానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం : గడ్డం ప్రసాద్ కుమార్
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో రూ.4 కోట్లతో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పార్క్ నిర్మించాల్సి ఉండగా.. ఆ పనులు చేపట్టలేదు. వీటిని రోడ్లు, డ్రెయినేజీ పనులకు మళ్లించారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో నిర్మించిన రోడ్లు చాలా చోట్ల క్రాక్ రావడంతోపాటు కంకర తేలింది. ఫుట్ పాత్ టైల్స్ ఊడిపోతున్నాయి.
అవినీతిపై విచారణ జరపాలి
సిటీలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని మాజీ మేయర్ సునీల్‌రావు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాను.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చే వరకు బల్దియా పాలకవర్గ బాధ్యత ఉంటుందని, ఆ తర్వాత టెండర్లు నిర్వహణ, ఓపెన్ చేయడం, పనులు చేయించడం, బిల్లు రికార్డు చేయడం, బిల్లులు చెల్లించడం అధికారులు చేస్తారన్నారు. ఎక్కడ ఏ లోపం జరిగిందో విచారణలో గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.