- ఆదివారం అటెండెన్స్ నుంచి మినహాయింపు
హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలనే నిబంధనల నుంచి నాంపల్లి కోర్టు మినహాయించింది. విదేశాలకు కూడా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ నేపథ్యంలో ఈ నెల 3న నాంపల్లి సెషన్స్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టిగేషన్ అధికారులకు సహకరించాలని, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని షరతులు విధించింది.
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు రాలేనని, ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అల్లు అర్జున్ ఆశ్రయించాడు. దీంతో పాటు విదేశాల్లో షూటింగ్స్ కోసం ముందస్తు షెడ్యూల్ ఖరారైందని.. ఇందులో భాగంగా విదేశాలకు వెళ్లేందుకూ అనుమతించాలని కోరాడు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. మినహాయింపులు ఇచ్చింది.