ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లపై నీలినీడలు

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లపై నీలినీడలు
  • పూర్తయినా ప్రారంభం కాని మార్కెట్​కాంప్లెక్స్​
  • స్థల వివాదంతో పెండింగ్​ పడిన ఓపెనింగ్​
  • మరో నాలుగు చోట్ల అదే పరిస్థితి 
  • బిల్లులు రాక పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఐదు చోట్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టినా ఒక్కటి కూడా పూర్తికాలేదు. నిజామాబాద్​ నగరంలో రెండు చోట్ల కూడా పనులు చివరి దశకు వచ్చి ఆగిపోయాయి. భీంగల్ లో కొంత వరకు పనులు జరగగా బోధన్​, ఆర్మూర్​లలో మార్కెట్ల నిర్మాణం పిల్లర్ల దశలోనే నిలిచిపోయింది. ​ 

ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు, నాన్​ వెజ్​ అమ్మకాలు జరుగుతుండడంతో చాలా చోట్ల ట్రాఫిక్​ సమస్యలు తలెత్తాయి. ఇష్టమొచ్చిన చోట కూరగాయలు, మటన్, చికెన్​, చేపల అమ్మడంవల్ల శుభ్రత లోపిస్తోంది. ఈ సమస్యలకు చెక్​ పట్టేందుకు గతంలో వెజ్​, నాన్ వెజ్​ ఒకే చోట అమ్ముకునేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం భావించింది. 

నిజామాబాద్ సిటీలో ఏటా కొత్త కాలనీలు ఏర్పడుతుండడంతో నగర జనాభా ఇప్పటికే 3.50 లక్షలకు చేరింది. వీక్లీమార్కెట్​(జుమెరాత్​ బజార్​), గంజ్​లో వెజిటెబుల్​అమ్మకాలు జరుగుతాయి. పండ్లు, మటన్​, చికెన్​, చేపల మార్కెట్​వేర్వేరు చోట్ల ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా నిజామాబాద్​ నగరంలో బోధన్​రోడ్​లోని పాత బస్టాండ్​ దగ్గర, ఖలీల్​వాడిలోని పాత సర్వే లాండ్​ రికార్డ్స్​ ఆఫీసుదగ్గర రెండు మార్కెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. 

అలాట్​మెంట్​కు బ్రేక్​

బోధన్​ రోడ్​బస్టాండ్​ దగ్గర నాలుగేండ్ల కింద టీయూఎఫ్​ఐడీసీ నిధుల నుంచి రూ.9 కోట్లతో మార్కెట్​ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఏడాది కిందటే 98 మడిగలతో మార్కెట్​ కాంప్లెక్స్​ నిర్మాణం దాదాపు పూర్తయిన తర్వాత స్థల వివాదం తెరపైకి వచ్చింది. గతంలో అక్కడ మేకల వ్యాపారం చేసిన వారు అది తమ ల్యాండ్​అని, అక్కడ కాంప్లెక్స్​ఎలా కట్టారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో మున్సిపల్​ అధికారులు షాపుల కేటాయింపు ప్రక్రియ నిలిపివేశారు. 

దీంతో ఏడాదిగా కాంప్లెక్స్ యాంటీ సోషల్​ యాక్టివిటీస్​కు అడ్డాగా మారింది. స్థలవివాదాన్ని పరిష్కరించి మార్కెట్​ను ప్రారంభించేందుకు అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ఆఫీసర్లతో ఇప్పటికే రెండుసార్లు మీటింగ్​ పెట్టినా ఫలితం కనిపించలేదు. 

90 శాతం పూర్తి 

ఖలీల్​వాడీలోని పాత సర్వే ల్యాండ్​ రికార్డ్స్​ ఆఫీస్​ గ్రౌండ్​లో రూ.7.20 కోట్లతో మరో ఇంటిగ్రేటెడ్​​ మార్కెట్​నిర్మాణం ప్రారంభించారు. పనులు దాదాపు 90 శాతం వరకు పూర్తయ్యాయి. కరెంట్​, ప్లంబింగ్​ వర్క్​ మాత్రమే మిగిలింది. కాంట్రాక్టర్​కు పాత బిల్లులు ఇవ్వకపోవడంవల్ల పనులు నిలిపివేసినట్టు తెలుస్తోంది. 

భీంగల్​ లో రూ.3.90 కోట్లతో చేపట్టిన మార్కెట్​ కూడా 80 శాతం వరకు పూర్తయింది. ఇక్కడా కాంట్రాక్టర్​వల్లే పనులు ఆగాయి. బోధన్​, ఆర్మూర్​లలో కూడా రూ.7.20 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయగా పనులు మొదలు పెట్టినా అవి పిల్లర్ల దగ్గరే ఆగిపోయాయి.