- 14 మందికి గాయాలు
- కుప్పకూలిన రెండంతస్తుల భవనం
- ఏపీలోని అమలాపురంలో ఘటన
కోనసీమ : ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పటాకులు తయారు చేస్తున్న ఓ ఇంట్లో పేలుడు సంభవించి 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
మెరుగైన వైద్యం కోసం మరికొందరిని కిమ్స్‌కు తరలించారు. బాణసంచా తయారీ కేంద్రం యజమాని గువ్వాల నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులు కూడా గాయపడిన వారిలో ఉన్నారు. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది.
పక్కనున్న మరో రెండిండ్లు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు శబ్దానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక ఎస్పీ కృష్ణారావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ధ్వంసమైన భవనం శిథిలాలను ప్రొక్లెయిన్‌తో తొలగించారు.