భీమాకోరేగావ్ స్ఫూర్తితో పోరాడిన అంబేద్కర్​

 భీమాకోరేగావ్ స్ఫూర్తితో పోరాడిన అంబేద్కర్​

మనుస్మృతి ఆధారంగా నడిచే  బ్రాహ్మణ రాజుల రాజ్యాన్ని కూలగొట్టి అణగారినవర్గాల విముక్తికి బాటలు వేసిన చారిత్రక నేపథ్యం గల పోరాటం భీమ్ కోరేగావ్​ది.  తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, బహుజన విముక్తి కోసం జరిగిన పోరాటం ఏదైనా ఉందంటే అది భీమా కోరేగావ్ యుద్ధ పోరాటమే.  ఇది చరిత్రలో చెరగని ముద్ర వేసిన యుద్ధం.

మహారాష్ట్రలోని  పూనా రాజ్యానికి చెందిన పీష్వా బ్రాహ్మణ రాజులు పూర్తిగా మనుస్మృతి శాసనం ఆధారంగా పరిపాలన కొనసాగించేవారు. వారి రాజ్యంలో ఉన్న అంటరాని కులాలవారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించేవారు కాదు. వారి జీవన హక్కులను కాలరాసి వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. సైన్యంలో కూడా
అంటరానివారు అనే నెపంతో  మహర్​లను చేర్చుకునేవారుకాదు.

పీష్వాలు జరిపిన అమానవీయ  పాలనకి అంటరాని మహర్ సమాజం బ్రిటిష్  సైన్యంతో  చేతులు కలిపింది. ఆంగ్లేయులు మహరులను తమ సైన్యంల్లోకి ఆహ్వానించారు. ఒంటి మీద వేసుకోవడానికి వారితో పాటుగా యూనిఫాం ఇచ్చి సమానంగా చూశారు.  క్రైస్తవ మిషనరీల ద్వారా విద్యను అందివ్వడం ఇలా అన్ని కొత్త కొత్త దశలు మహర్ల జీవితాలలోకి వచ్చాయి, బ్రిటిష్ సైన్యంలో భాగమైన బొంబాయి ఇన్ ఫ్రాంట్రీలోని మహర్ రెజిమెంటును ఏర్పాటు చేశారు. వారి ఆచార సంప్రదాయాలలో ఆలోచనలలో గొప్పమార్పు వచ్చింది. 

చరిత్రలో చెరగని ముద్ర

పీష్వా బాజీరావ్-2  సైన్యాలు ఎప్పుడైతే ఖర్కీ,  పూనా కోటలను తమ అధీనంలో ఉంటాయని ప్రకటించిందో అప్పుడు కెప్టెన్ స్టాటన్ నేతృత్వంలో మహర్  సైన్యాధిపతి సిద్నాక్ సారథ్యంలో అతి స్వల్ప 500 మంది మహర్ సైన్యంతో 28 వేల మంది పీష్వా సైన్యంపై యుద్ధానికి నాంది పలికాడు.  

పీష్వాలతో భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో మహర్ సేనాధిపతి  సిద్నాక్ మహర్ సైనికులు తమ చివరి శ్వాస వరకు చివరి తూటా వరకు పోరాడుతారని తేల్చి చెప్పాడు.  విరోచితమైన పోరు సల్పి పీష్వా సేనల మీద విరుచుకుపడింది మహర్ సైన్యం, మహర్ సైన్యం  ధాటికి రాత్రి 9 గంటలకు పీష్వా సైన్యం పారిపోయింది. అంటరాని కులాలకు విముక్తిని ప్రసాదించింది ఈ విజయం.

బాబా సాహెబ్ అంబేద్కర్​కు స్ఫూర్తి

నూతన శకానికి నాంది పలికిన  ఈ యుద్ధంలో అమరులైన వీరుల అమరత్వానికి జ్ఞాపకంగా బ్రిటిష్ పాలకులు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.  భీమా నది తీరాన కోరేగావ్ గ్రామంలో జరిగిన  ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోవాలని వీరమరణం పొందిన గాయపడినవారి పేర్లను చెక్కించి కోరేగావ్ యుద్ధ మెమోరియల్ గా స్తూపాన్ని 1821 మార్చి 28న కట్టించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  ప్రతి సంవత్సరం జనవరి 1న తప్పకుండా మహర్ సైనికుల పరాక్రమానికి ప్రతీక అయిన ఈ  స్థూపాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించేవారు.

అంబేద్కర్ తన ప్రతి పోరాటంలో భీమా కోరేగావ్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని అసమానతలపై  ఎదురు నిలిచి పోరాడేవారు. ఈ చారిత్రక నేపథ్యం నుంచి నవభారత మూలవాసులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న?  పశువుల కంటే హీనంగా చూసిన వ్యవస్థ నుంచి తమ హక్కుల కోసం,  అస్తిత్వం కోసం అణచివేతలను ఎదిరించి ఆధిపత్యంకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన చరిత్ర మహర్ రెజిమెంట్​ది. అంటరాని కులాల తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా ఈ భీమాకోరేగావ్ యుద్ధం నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. 

నాడు 1818  కంటే ముందు ఉన్న రాచరికపు పరిస్థితులే  నేడు  ప్రజాస్వామ్య భారతావనిలో కొనసాగుతుండటం భావదరిద్రం.  ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా  వ్యవహరించాల్సిన  పాలకులు విభజన రాజకీయాలు చేస్తూ దళితులలో అనైక్యత బీజాలను పెంచి పోషిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి  ప్రతి బుద్ధి జీవి  ప్రజాస్వామిక తిరుగుబాటు పోరాటాలకు శ్రీకారం చుట్టాలి.  రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని,  రాజ్యాంగ నిర్మాతకు జరుగుతున్న అవమానాన్ని ఈ దేశ పౌరులుగా  తిప్పికొట్టాల్సిన కనీస భాద్యత మనపై ఉంది. కోల్పోయిన హక్కుల కోసం బతిమిలాడితేనో  లేదా బిక్షాటన చేస్తేనో హక్కులు సాధించలేం.  పోరాటాలే శరణ్యం అన్న బాబాసాహెబ్ బాటలో నడిచినపుడే మహర్ సైన్యానికి నిజమైన నివాళి.

అంబేద్కర్​పై అక్కసు 

75 ఏండ్లు అయినా రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.  90 ఏండ్ల క్రితం మను ధర్మశాస్త్రాన్ని అంబేద్కర్  దగ్ధం చేసి మనువాదులకు సవాల్ విసిరితే  నేడు  మన అనైక్యత వలన ఆ మనువాదుల వారసులు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్​ని అవమానిస్తూ మనకు తిరిగి సవాల్ విసిరారు.  

అంబేద్కర్ పై ఉన్న అక్కసునంత వెళ్లకక్కిండ్రు. ఇది వాళ్ళ అసలు రంగన్న విషయం మన అందరికీ తెలిసినదే. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేమిటంటే ప్రపంచం మొత్తం అంబేద్కర్​ని మేధావిగా,  జ్ఞానవంతుడిగా స్వీకరిస్తూ వారి చట్టసభలలో గౌరవిస్తుంటే, దానికి భిన్నంగా ఏ రాజ్యాంగాన్ని కాపాడతానని పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణం చేశారో,  అదే పార్లమెంట్​లో రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్​ను అవమానించడం అనేది సహించలేని అంశం.  

ఇది అంబేద్కర్ వాదులందరికి పార్లమెంట్ కేంద్రంగా సవాల్ విసిరినట్లే  ఈ సవాల్​ను ఎంతమంది స్వీకరించారో అర్థం కావడం లేదు.  మాకేంటి అంటూ అంబేద్కర్  ఫలాలను పొందిన ఆ వర్గాల ప్రజలే సంఘటితంగా అనుకున్నంత పోరాటం చేయలేక మౌనంగా ఉండటం అనేది  అమరులైన మహర్ సైనికుల వీరత్వానికి అవమానమే అవుతుంది. ఒక్క మాటలో  చెప్పాలంటే.. మనవాదుల మౌనం మనువాదులకంటే ప్రమాదకరం అని గుర్తుంచుకోవాలి. 

-  పిల్లి సుధాకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాల మహానాడు-