
- మూడు రాష్ట్రాల్లో 32 మంది మృతి
- పదుల సంఖ్యలో గాయపడ్డ జనం
ఒక్లహోమా సిటీ: అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. ప్రధానంగా మిస్సోరి, అర్కన్సాస్, టెక్సస్ రాష్ట్రాల్లో మొత్తంగా 32 మంది చనిపోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని అధికారులు తెలిపారు. గంటకు 130 కి.మీ. వేగంతో వీచిన పెనుగాలుల ధాటికి ఇల్లూవాకిలీ కొట్టుకుపోయి చాలామంది కట్టుబట్టలతో మిగిలిపోయారని వివరించారు.
గాలుల ధాటికి ఓ ట్రక్కు బోల్తా పడిందన్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నట్లు తెలిపారు. మిస్సోరిలో పదిమంది చనిపోగా, అర్కన్సాస్‌లో ముగ్గురు, టెక్సస్‌లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. హైవేలపై వెళుతున్న వాహనాలు పెనుగాలులకు ప్రమాదానికి గురయ్యాయని, ఒకదానిని మరొకటి ఢీ కొన్నాయని వివరించారు. ఆ ప్రయాణిస్తున్న వాళ్లలో కొంతమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారని వివరించారు. మిస్సోరీ హైవేపై జరిగిన ప్రమాదాల్లో పదిమంది చనిపోయినట్లు తెలిపారు.
మిసిసిప్పి వ్యాలీలో టోర్నడోల ప్రభావం మరింత తీవ్రంగా ఉందని, ఓ ఇళ్లు తలకిందులుగా పడగా లోపల చిక్కుకున్న ఓ మహిళను కాపాడామని అధికారులు పేర్కొన్నారు. తుపాను ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, పునరుద్ధరణ ఎప్పటికి సాధ్యమవుతుందనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. టోర్నడోల ప్రభావంతో ఒక్లహోమా రాష్ట్రంలో మొత్తం 130 చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయని అధికారులు తెలిపారు. మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని చెప్పారు.