తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ మాట ఇస్తే తప్పదన్నారు. సూర్యపేట బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. బీజేపీ పేదల పార్టీ అని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. కొడుకును సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమని అమిత్ షా అన్నారు. కేసీఆర్ కు బీసీల సంక్షేమం పట్టదన్నారు. రాహుల్ ను పీఎం చేయడం సోనియాగాంధీ లక్ష్యమని చెప్పారు. కేసీఆర్ బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు అమిత్ షా. సమగ్రమైన అభివృద్ధి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నారు. వరంగల్ లో సమ్మక్క సారక్క ట్రైబల్ వర్శీటీ ఏర్పాటు చేసిన మోడీకే దక్కుతుందన్నారు. పసుపు రైతులకు కోసం బోర్టు ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా నీళ్లలో తెలంగాణ హక్కుల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ సంక్షేమ కోసమే పనిచేస్తాయి కాబట్టి వాళ్ల మాటలను నమ్మొద్దని సూచించారు అమిత్ షా. బీఆర్ఎస్ పేదల వ్యతిరేక పార్టీ..బీసీల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమీ హామీ ఏమైందని కేసీఆర్ ను ప్రశ్నించారు అమిత్ షా. దళితుల సంక్షేమం కోసం 50 వేల కోట్లతో ప్రత్యేక కార్యక్రమం ఎటు పోయిందన్నారు. తెలంగాణలోని 40 లక్షల రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 9 వేల కోట్లిస్తున్నామన్నారు. జలజీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రజలకు పెద్ద ఎత్తును నిధులు ఇస్తున్నామన్నారు.