చాలా హ్యాపీగా ఉంది.. హిడ్మా ఇలాకాలో పర్యటించిన అమిత్​షా

చాలా హ్యాపీగా ఉంది.. హిడ్మా ఇలాకాలో పర్యటించిన అమిత్​షా

జగదల్‌‌పూర్, భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన సుమారు 30 మంది మావోయిస్టులు ఆదివారం పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా సోమవారం చత్తీస్‌‌గఢ్‎లోని జగదల్‌‌పూర్‎లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని.. లొంగిపోయిన మావోయిస్టులతో మాట్లాడారు. "ఈ రోజు మీ కంటే.. మీ కుటుంబం కంటే నేనే చాలా సంతోషిస్తున్న వ్యక్తిని. మావోయిస్టులు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో చేరాలని మిమ్మల్ని ఒప్పించేందుకు మేము చేసిన కృషి ఫలించింది. 

ఇక్కడ జరిగిన కార్యక్రమం చిన్నదే కావచ్చు. కానీ, చాలా ముఖ్యమైనది" అని అమిత్ షా అన్నారు. హింసతో జరిగే నష్టాన్ని, లొంగిపోవడంతో జరిగే ప్రయోజనాన్ని గ్రహించి.. దేశంలోని యువకులు తమ విజ్ఞప్తికి ప్రతిస్పందిస్తున్నందుకు తనకు ఎనలేని సంతృప్తి కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ తనకు హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించినప్పుడు.. సాయుధ ఉద్యమాల్లో పాల్గొన్న వారు.. ఆయుధాలు వదిలేసి లొంగిపోతే.. వారికి ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఇవ్వాలని తాను భావించానని షా చెప్పారు.

హిడ్మా ఇలాకాలో పర్యటించిన అమిత్​షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా సోమవారం మావోయిస్టుల కంచుకోట ఛత్తీస్​గఢ్​రాష్ట్రం దండకారణ్యంలోని బీజాపూర్​జిల్లా గుండం గ్రామంలో పర్యటించారు. ఆయన స్థానిక ఆదివాసీలతో చెట్టు కిందనే కూర్చుని సమావేశం అయ్యారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఇలాకాలో కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటించడం విశేషం. సమీపంలోని పాఠశాలకు వెళ్లి విద్యార్ధులతో ఆయన ముచ్చటించారు.