- 10 వాటర్ ట్యాంక్ లు, 77 కి.మీ. పైప్ లైన్ నిర్మాణం
- పనులకు టెండర్లు ఖరారు
- 19న మంత్రి దామోదర శంకుస్థాపన
మెదక్, నర్సాపూర్, తూప్రాన్, వెలుగు: అమృత్ స్కీం రెండో విడతలో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన మున్సిపాలిటీలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ఈ నిధులను మున్సిపల్ పట్టణాల్లో తాగునీటి సరఫరా, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, కాలుష్య నియంత్రణ వంటి పనులకు వినియోగించుకునే అవకాశం ఉంది. మొదటి దశలో జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా కోసం రూ.51 కోట్లు మంజూరయ్యాయి. పెరుగుతున్న జనాభా, భవిష్యత్అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటర్ ట్యాంక్‌లు, పైప్లైన్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు.
పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అమృత్ స్కీం పనులు చేపట్టున్నండగా, ఈ పనులకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. ఈ నెల 19న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామెదర రాజనర్సింహ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.మెదక్ మున్సిపాలిటీకి అత్యధికంగా రూ.30 కోట్లు మంజూరు కాగా ఆరు చోట్ల వాటర్ ట్యాంక్‌లు నిర్మించాలని నిర్ణయించారు. 3 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఆ ట్యాంక్‌లను నిర్మించనుండగా, సోర్స్నుంచి ట్యాంక్‌లు నింపేందుకు 6 కిలో మీటర్ల దూరం ఫీడర్పైప్ లైన్, ట్యాంక్‌ల నుంచి పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి నీటి సరఫరా కోసం 41 కిలో మీటర్ల దూరం డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ నిర్మించనున్నారు.
సుమారు 80 వేల జనాభా ఉన్న మెదక్ పట్టణంలో ఇంటింటికీ తాగునీటి సరఫరా కోసం రూ.50 కోట్లతో భగీరథ స్కీం నిర్మించినప్పటికీ అన్ని ఇళ్లకు సరిపడా తాగునీరు అందడం లేదు. అంతేగాక పలు కొత్త కాలనీలు వెలియడం వల్ల తాగునీటి అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో అమృత్ స్కీం కింద కొత్తగా 3 లక్షల లీటర్ల కెపాసిటీతో ఆరు ట్యాంక్‌లు నిర్మించి పైప్‌లైన్ వేయనుండడంతో తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి.
నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.12 కోట్లు మంజూరు కాగా కొత్తగా రెండు వాటర్ ట్యాంకులు నిర్మించనున్నారు. 12 కిలోమీటర్లు పైపులైన్ వేయనున్నారు. సుమారు 35 వేల జనాభా ఉన్న పట్టణంలో ప్రస్తుతం ఉన్న వనరుల ద్వారా సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదు. ఇప్పుడు నిర్మించే కొత్త వాటర్ ట్యాంక్‌ల ద్వారా ఇబ్బందులు దూరమయ్యే అవకాశం ఉంది. తూప్రాన్ మున్సిపాలిటీకి రూ.9 కోట్లు మంజూరు కాగా రెండు వార్డుల్లో కొత్తగా వాటర్‌ట్యాంక్‌లు, 15 కిలో మీటర్ల దూరం పైప్‌లైన్ నిర్మించనున్నారు. 32 వేల జనాభా గల మున్సిపాలిటీ పరిధిలో కొత్త ట్యాంక్‌ల నిర్మాణం వల్ల తాగునీటి ఇబ్బందులు
తొలగిపోనున్నాయి.
ఎంతో ప్రయోజనం
అమృత్స్కీం రెండో విడతలో మెదక్ మున్సిపాలిటీకి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణ పరిధిలోని ఆరు చోట్ల 3 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణం, 41 కిలో మీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నాం. దీంతో అనేక ప్రాంతాలకు తాగునీటి ఇబ్బందులు దూరమవుతాయి. – చంద్రపాల్, మెదక్ మున్సిపల్ చైర్మన్